దొంగగా రవితేజ?


టైగర్ నాగేశ్వరరావు.. ఇప్పటి వాళ్లకు ఈ పేరు గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. 70లు.. 80ల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పేరు తీవ్ర చర్చనీయాంశమే. ఈ పేరెత్తితే జనాల గుండెలు హడలిపోయేవి. అతనో క్రూరుడైన దొంగ కావడమే అందుక్కారణం. 70ల్లో టైగర్ నాగేశ్వరరావు ఎన్నో దొంగతనాలు చేశాడు. అతడి కథతో తెలుగులో ఓ సినిమా చేయడానికి కొన్నేళ్ల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ కథ మీద ఎంతో ఆసక్తితో ఉన్నాడు. ఇంతకుముందు ‘దొంగాట’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ లాంటి క్రైమ్ థ్రిల్లర్లు తీసిన వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఈ సినిమా చేయడానికి రెండేళ్ల ముందే సన్నాహాలు జరిగాయి.

ఇందులో లీడ్ రోల్‌కు రానా దగ్గుబాటి, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి పేర్లు వినిపించాయి. కానీ ఏమైందో ఏమో.. తర్వాత ఈ సినిమా గురించి చర్చే లేదు. ఐతే ఇప్పుడు మళ్లీ టైగర్ నాగేశ్వరరావు సినిమాకు సంబంధించి కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కథను రవితేజ దగ్గరికి తీసుకెళ్లగా అతను సినిమా చేయడానికి అంగీకారం తెలిపినట్లుగా చెబుతున్నారు.

ఆల్రెడీ ‘ఖిలాడి’ సినిమాను పూర్తి చేసిన రవితేజ.. ప్రస్తుతం ‘రామారావు’తో పాటు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమాను లైన్లో పెట్టాడు. ఇవన్నీ పూర్తయ్యాక టైగర్ నాగేశ్వరరావు సినిమాను రవితేజ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ‘విక్రమార్కుడు’లో దొంగ పాత్రతో అలరించాడు రవితేజ. ఐతే అది పూర్తిగా కామెడీ రోల్. కానీ ఇప్పుడు సీరియస్‌గా, పూర్తి స్థాయిలో దొంగ పాత్రలో కనిపించాల్సి ఉంటుంది. మరి రవితేజ ఈ పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.

టైగర్ నాగేశ్వరరావు దశాబ్దానికి పైగా ఎన్నో దొంగతనాలు చేశాడు. పోలీసులకు దొరక్కుండా తెలివిగా తప్పించుకున్నాడు. అతను ఒకట్రెండుసార్లు పోలీసుల కస్టడీ నుంచి కూడా తప్పించుకుని పారిపోయాడు కూడా. పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన అతను చెన్నై జైలు నుంచి తప్పించుకున్న సమయంలో ‘టైగర్’ అనే పేరు తెచ్చుకున్నాడు. స్టువర్టుపురంలోని నాగేశ్వరరావు ఇంటి ముందు ‘టైగర్’ బొమ్మ కూడా వేలాడదీసి ఉండేది. చాలా ఏళ్ల పాటు పోలీసులకు పెద్ద తలనొప్పిగా ఉన్న టైగర్ నాగేశ్వరరావు చివరికి 1987 పోలీసుల చేతిలోనే హతమయ్యాడు.