‘ఆఫీసర్’ రిజల్ట్.. నాగ్ స్పందించాడు

‘ఆఫీసర్’ రిజల్ట్.. నాగ్ స్పందించాడు

గత దశాబ్ద కాలంలో రామ్ గోపాల్ ట్రాక్ రికార్డు చూసి చిన్న స్థాయి హీరోలు కూడా ఆయనతో పని చేయడానికి సందేహిస్తున్న పరిస్థితి. కానీ అక్కినేని నాగార్జున మాత్రం వర్మను నమ్మాడు. ఎందరు వారించినా వెనక్కి తగ్గకుండా వర్మతో సినిమా చేశాడు. అందుకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు.

వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఆఫీసర్’ సినిమా దారుణాతి దారుణమైన ఫలితాన్నందుకుంది. నాగ్ కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేని పరాభవంగా నిలిచిపోయేలా ఉందీ చిత్రం. దీనికి వస్తున్న వసూళ్లు చూసి అక్కినేని అభిమానులు అవమాన భారంతో అల్లాడిపోతున్న పరిస్థితి. ఈ సినిమా ఇలా తయారైనందుకు వర్మను ఎవరూ తిట్టట్లేదు. అతను దీని కంటే చెత్త సినిమాలు చాలానే తీశాడు. అలాంటి దర్శకుడిని నమ్మి నాగ్ ఈ సినిమా చేయడమే తప్పంటున్నారు.

చేసిన తప్పుకు నాగ్ ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు. ‘ఆఫీసర్’ చేస్తున్నపుడే నాగ్‌కు ఈ సినిమా ఫలితం తెలిసిపోయిందని చిత్ర వర్గాలు అంటున్నాయి. కానీ ఈ సినిమాకు మరీ ఇంత దారుణమైన ఫలితం ఉంటుందని నాగ్ ఊహించి ఉండడు. ఈ చిత్ర వసూళ్లు కచ్చితంగా ఆయన్ని విస్మయానికి గురి చేస్తుంటాయి. అందుకే సైలెంటుగా ఉండిపోయాడు. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ల గురించి కూడా ఆలోచించలేదు. ఒకవేళ తర్వాతి రోజుల్లో మీడియాను ఎదుర్కోవాల్సి వస్తే ‘ఆఫీసర్’ గురించి నాగ్ ఏమంటాడో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

ఐతే అంతకంటే ముందే ‘ఆఫీసర్’ పేరెత్తకుండా దాని ఫలితం గురించి పరోక్షంగా ఒక ట్వీట్ పెట్టాడు ఈ రోజు నాగ్. వారం గడిచిపోయి సోమవారం వచ్చిందని.. ‘విజయం అంతిమం కాదు.. పరాజయం భయానకం కాదని.. ఏం జరిగిన ముందుకు సాగిపోవడమే మనిషి బలాన్ని చాటుతుందని విన్ స్టన్ చర్చిల్ అన్నాడని.. కాబట్టి చిరునవ్వుతో ప్రయాణం కొనసాగించాలనుకుంటున్నానని నాగ్ వేదాంత ధోరణిలో ఒక ట్వీట్ పెట్టాడు. ‘ఆఫీసర్’ ఫలితంతో తానేమీ కుంగిపోలేదని సంకేతాలివ్వడానికే నాగ్ ఇలా ట్వీట్ పెట్టినట్లు అర్థమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు