టాక్సీవాలా.. మళ్లీ.. మళ్లీ..

టాక్సీవాలా.. మళ్లీ.. మళ్లీ..

‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. దీని ప్రోమోలు సినిమాపై క్యూరియాసిటీ తీసుకొచ్చాయి. అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈ ‘టాక్సీవాలా’ మే 18నే ప్రేక్షకుల ముందుకు రావల్సింది. రిలీజ్ డేట్ ఇచ్చి ప్రమోషన్ల జోరు కూడా పెంచారు.

కానీ అనుకోకుండా ఆ సినిమా వాయిదా పడిపోయింది. తర్వాత జూన్ రెండో వారంలో రిలీజ్ అని అన్నారు. ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. విజయ్ దేవరకొండ కూడా జూన్ 14న సినిమా రాబోతున్న సంకేతాలిచ్చాడు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ నెలలో కూడా సినిమా విడుదల కావట్లేదట. నెలన్నర పాటు సినిమాను వాయిదా వేస్తున్నారని.. జులై నెలాఖర్లో కానీ ‘టాక్సీవాలా’ విడుదల కాదని అంటున్నారు.

సైన్స్ ఫిక్షన్‌తో ముడిపడ్డ ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘టాక్సీవాలా’. ఈ కథాంశం చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఇందులో విజువల్ ఎఫెక్టులకు చాలా ప్రాధాన్యం ఉన్నటుల సమాచారం. దానికి సంబంధించిన పనే ఆలస్యం అవుతోందట. ఔట్ పుట్ అనుకున్నట్లుగా రాకపోవడంతో సమర్పకుడు అల్లు అరవింద్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

సినిమా ఆలస్యమైనా పర్వాలేదు కానీ.. క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దని చెప్పడంతో విడుదల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు తెచ్చుకుని ‘ది ఎండ్’ అనే హార్రర్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్ సంకృత్యన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. హీరోయిన్ సహా ఇందులోని చాలామంది నటీనటులు కొత్తవాళ్లే. గీతా ఆర్ట్స్.. యువి క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థలు రెండు కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు