రజనీ రేంజ్ ఇలా పడిపోయిందేంటి..

రజనీ రేంజ్ ఇలా పడిపోయిందేంటి..

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తోందంటే దానికి హైప్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రజనీ ఎలాంటి దర్శకుడితో పని చేసినా సరే.. హైప్ అనేది కామన్. కొన్నేళ్ల కిందట అసలేమాత్రం ఫాంలో లేని కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో ‘లింగ’ మూవీ చేశాడు సూపర్ స్టార్. ఆ సినిమాకు కూడా బంపర్ క్రేజ్ వచ్చింది. ప్రి రిలీజ్ బుకింగ్స్ జోరుగా నడిచాయి. దానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దాని కంటే ముందు తర్వాత కూడా ఇదే జోరు నడిచింది.

రెండేళ్ల కిందట ‘కబాలి’ జనాల్ని ఎలా వెర్రెత్తించిందో.. ఆ సినిమా టికెట్ల కోసం ఎంత డిమాండ్ ఏర్పడిందో.. దానికి ఓపెనింగ్స్ ఏ స్థాయిలో వచ్చాయో తెలిసిందే. కానీ ఇప్పుడు ‘కాలా’ పరిస్థితి చూస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతోంది. ఈ గురువారం రిలీజ్ కాబోయే ఈ చిత్రానికి తమిళనాట పరిస్థితి ఎలా ఉందో కానీ.. తెలుగులో మాత్రం రెస్పాన్స్ చూస్తే షాకవక తప్పదు.

మామూలుగా రజనీ సినిమాకు ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ చేయడం ఆలస్యం.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతాయి. నిమిషాల్లోనే ‘ఫిల్లింగ్ ఫాస్ట్’ అని.. కొన్ని గంటల్లోనే ‘సోల్డ్ ఔట్’ అని మెసేజ్‌లు కనిపిస్తాయి. కానీ ‘కాలా’ విషయంలో అలాంటి దృశ్యాలేమీ కనిపించడం లేదు. మూడు రోజుల ముందే చాలా థియేటర్లలో బుకింగ్స్ ఆరంభించగా రెస్పాన్స్ పేలవంగా ఉంది.
టికెట్ల బుకింగ్ కోసం అంత ఆసక్తి కనిపించడం లేదు ప్రేక్షకుల్లో. దీన్ని బట్టి ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. రజనీ రేంజ్ ఇలా పడిపోయిందేంటన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. ‘కాలా’ మీద ముందు నుంచి అంచనాలు తక్కువగానే ఉన్నాయి కానీ.. రిలీజ్ టైం వచ్చేసరికి పరిస్థితి మారుతుందనుకున్నారు. కానీ అలాంటిదేమీ కనిపించడం లేదు. రజనీ గత సినిమాలతో పోలిస్తే తమిళంలో సైతం స్పందన ఆశించిన స్థాయిలో లేదని అక్కడి బుకింగ్స్ చూస్తే అర్థమవుతోంది.

‘కబాలి’ మీద చాలా ఆశలు పెట్టుకుని తీవ్ర నిరాశకు గురైన నేపథ్యంలో మళ్లీ అదే కాంబినేషన్లో సినిమా అనేసరికి తెలుగు ప్రేక్షకుల్లో నిరాసక్తత నెలకొన్నట్లుంది. ‘కాలా’ ప్రోమోలన్నీ కూడా ‘కబాలి’ స్టయిల్లోనే ఉండటం ప్రతికూలంగా మారింది. మరి రిలీజ్ రోజుకైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English