ఆఫీసర్.. చరిత్రలో నిలిచిపోయే సినిమా

ఆఫీసర్.. చరిత్రలో నిలిచిపోయే సినిమా

ఎంత పెద్ద హీరోకైనా ఫ్లాపులన్నవి కామనే. అప్పుడప్పుడూ జడ్జిమెంట్ తేడా కొట్టి సినిమాలు పోవడం మామూలే. కొన్నిసార్లు ఫలితం మరీ దారుణంగా ఉంటుంది. కెరీర్లోనే అత్యంత దారుణమైన పరాజయాన్ని ఎదుర్కొంటారు. అది కెరీర్లో ఒక మచ్చగా నిలిచిపోతుంది. తర్వాత ఆ హీరో కెరీర్లో ఇంకేదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైతే దాంతో పోలిక వస్తుంటుంది. అక్కినేని నాగార్జున కెరీర్లో అలాంటి సినిమాల జాబితా తీస్తే అగ్రభాగాన నిలిచేది ‘ఆకాశవీధిలో’.

కొన్నేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకుని చాలా లేటుగా రిలీజైన ఈ చిత్రం అప్పట్లో నాగార్జునకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది. కనీస ఓపెనింగ్స్ లేవు. వారం తిరక్కుండానే థియేటర్ల నుంచి సినిమా లేచిపోయింది. నాగ్ కెరీర్లో డిజాస్టర్లు మరెన్నో ఉన్నప్పటికీ దీన్ని మించిన ఫ్లాప్ రాలేదనే చెప్పాలి. తెలుగులో ఇంకేవైనా పెద్ద హీరో సినిమా వచ్చి అట్టర్ ఫ్లాప్ అయినప్పుడు కూడా ఇది చర్చలోకి వచ్చేది.

ఐతే నాగ్ కెరీర్లో అతి పెద్ద ఫ్లాప్‌గా ఇకపై ‘ఆకాశవీధిలో’ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దాని స్థానాన్ని ‘ఆఫీసర్’ విజయవంతంగా భర్తీ చేసేసింది. నిజానికి నాగ్ కెరీర్ అనే కాదు.. మొత్తం తెలుగు సినిమా చరిత్రలోనే పెద్ద హీరోల సినిమాల్లో అత్యంత దారుణమైన డిజాస్టర్ ఏదన్నా కూడా ‘ఆఫీసర్’ గురించే మాట్లాడుకుంటారిక. దీన్ని కొట్టే సినిమా ఇంకోటి వస్తుందా అంటే సందేహమే. ఎందుకంటే రెండో రోజుకే థియేటర్లన్నీ ఖాళీ అయిపోయి.. మెజారిటీ ఏరియాల్లో మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రాకుండా.. జీరో షేర్ పొజిషన్‌కు రావడమంటే మాటలా?

స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరోకూ ఇలాంటి అవమానం ఎదురై ఉండదు. టాలీవుడ్లో ఎన్నో డిజాస్టర్లు చూశాం. మార్నింగ్ షోతోనే పేలవమైన టాక్ రావడంతో తర్వాతి షో నుంచే థియేటర్లు వెలవెలబోవడం చూశాం. కానీ మరీ ఈ స్థాయిలో తొలి వీకెండ్లోనే మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రాని పెద్ద హీరో సినిమా మాత్రం ఇదే అయ్యుంటుంది. కాబట్టి దీన్ని చరిత్రలో నిలిచిపోయే సినిమాగానే చెప్పాలి. టాలీవుడ్లో అతి పెద్ద డిజాస్టర్ల చర్చ వచ్చినపుడల్లా ముందు ‘ఆఫీసర్’నే రెఫరెన్స్‌గా తీసుకుంటారు ఈ విషయంలో దీన్ని కొట్టే స్టార్ హీరో సినిమా ఎప్పటికైనా ఇంకోటి వస్తుందా అంటే సందేహమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు