దారుణాతి దారుణ‌మైన ఓపెనింగ్స్‌

దారుణాతి దారుణ‌మైన ఓపెనింగ్స్‌

‘శివ’ లాంటి ఆల్ టైం సెన్సేషనల్ మూవీ అందించిన రామ్ గోపాల్ వర్మ-అక్కినేని నాగార్జున కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘ఆఫీసర్’. ఐతే అప్పటికి ఇప్పటికి వర్మ దర్శకుడిగా చాలా పతనం అయిపోవడంతో దీనిపై అసలు అంచనాలు లేకపోయాయి. కానీ వర్మ మీద ఆశ లేకపోయినప్పటికీ.. నాగార్జున ఫాలోయింగ్ అయినా కలిసొచ్చి ‘ఆఫీసర్’కు ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్నారు.

కానీ నాగ్ కెరీర్లోనే ఎన్నడూ లేని స్థాయిలో దారుణాది దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి ఈ చిత్రానికి. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.57 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఇక రెండో రోజు నుంచి పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. వీకెండ్లో కోటి రూపాయల షేర్ రావడం గగనంగా ఉంది. ఐతే ఎంత చెత్త సినిమా తీసినా.. చిత్ర బృందం కొంచెం ప్రమోషన్లు చేసి వీకెండ్ వరకు అయినా సినిమా నిలబడేలా చేయడానికి ట్రై చేస్తుంటుంది.

కానీ ‘ఆఫీసర్’ విషయంలో అలాంటి ప్రయత్నమే జరగడం లేదు. వర్మతో సినిమా చేయడం ఎంత పెద్ద తప్పో నాగార్జునకు లేటుగా అర్థమైందేమో.. రిలీజ్ తర్వాత సినిమా గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ నాగ్‌కు పెద్ద అవమానమే. ఈ స్థితిలో ఇక సినిమా గురించి మాట్లాడితే ఆయనకు అది మరింత అవమానమే అవుతుంది. ఆయనెంత ప్రయత్నించినా కూడా సినిమాను పైకి లేపే అవకాశం లేదు. అందుకే నాగ్ కామ్‌గా ఉన్నట్లున్నాడు.

ఇక ‘ఆఫీసర్’కు నిర్మాత కూడా అయిన వర్మ కూడా మౌనంగానే ఉన్నాడు. రిలీజ్ రోజు అమల సినిమాను పొగుడుతూ పెట్టిన మెసేజ్‌ను షేర్ చేసుకున్నాడు తప్పితే వర్మ తర్వాత స్పందించలేదు. రెండు రోజులుగా మౌనంగా ఉంటున్నాడు. ఈ రోజు రాజకీయ నేతల మీద తనదైన శైలిలో ఒక సెటైర్‌ వేశాడు తప్ప.. సినిమా గురించి నో డిస్కషన్. మిగతా వాళ్లెవ్వరూ కూడా సినిమా గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మొత్తానికి ‘ఆఫీసర్’ను కాపాడే ప్రయత్నం చేసినా వృథా అనుకున్నారేమో అందరూ సైలెంటైపోయినట్లున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు