అతడిని రాజ్ తరుణ్ మ్యాచ్ చేయగలడా?

అతడిని రాజ్ తరుణ్ మ్యాచ్ చేయగలడా?

రాజ్ తరుణ్ చాలా సాఫ్ట్‌గా కనిపించే హీరో. ఐదారేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా ఇంకా ‘ముదురుతనం’ ఏమీ రాలేదు. టీనేజ్ హీరో లాగే ఉంటాడు. అతడి ఆహార్యానికి అన్ని రకాల పాత్రలూ సూటవ్వవు. సాఫ్ట్‌గా ఉండే క్యారెక్టర్లే చేయాలి. కానీ అతను మాత్రం ఒక రౌడీ పాత్ర చేయడానికి రెడీ అయిపోతున్నాడన్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘నానుమ్ రౌడీ దా’ రీమేక్‌లో రాజ్ నటించబోతున్నాడన్న సమాచారం ఈ రోజు బయటికి వచ్చింది. సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. విజయ్ సేతుపతి నటించిన సినిమాలో రాజ్ తరుణ్ అనే మాట వినడానికి ఏదోలా ఉంటోంది. అతను మామూలు నటుడు కాదు. రఫ్ క్యారెక్టర్లను అద్భుతంగా పండిస్తుంటాడు.

‘నానుమ్ రౌడీ దా’లో విజయ్‌ది రౌడీ పాత్రే. అది కొంచెం రఫ్‌గా, ఫన్నీగా ఉంటుంది. అందులో విజయ్ పెర్ఫామెన్స్ చూస్తే ఫిదా అయిపోతాం. అలాంటి పాత్రలో మెప్పించడం.. అలాంటి నటుడిని మ్యాచ్ చేయడం అంటే మాటలు కాదు. ఇక్కడో చిత్రమైన విషయం ఏంటంటే.. ‘నానుమ్ రౌడీ దా’ ఆల్రెడీ తెలుగులో ‘నేనూ రౌడీనే’ పేరుతో డబ్ అయి విడుదలైంది.

కానీ జనాలు పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. ఈ చిత్రాన్ని రిలీజ్ చేసింది కూడా సి.కళ్యాణే. ఆయనే ఇప్పుడు రీమేక్‌కు సన్నాహాలు చేస్తున్నాడు. ఇంకా దర్శకుడెవరన్నది ఖరారవ్వలేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రాజ్ తరుణ్.. తాజాగా ‘రాజు గాడు’తో మరో ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకున్నాడు. మరి ‘నానుమ్ రౌడీదా’ రీమేక్ అయినా అతడికి విజయాన్నందిస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు