వర్మ రెడీ.. ఎవరైనా ఉన్నారా?

వర్మ రెడీ.. ఎవరైనా ఉన్నారా?

‘శివ’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమపై.. ఆ మాటకొస్తే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీపై రామ్ గోపాల్ వర్మ చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. వన్ ఫిలిం వండర్ లాగా మిగిలిపోకుండా ఆ తర్వాత కూడా ‘రంగీలా’.. ‘సత్య’.. ‘కంపెనీ’.. ‘సర్కార్’ లాంటి క్లాసిక్స్ తీసిన ఘనుడు వర్మ. ఆయన ఒక ఫ్లాప్ సినిమా తీసినా అందులో ఏదో ప్రత్యేకత కనిపించేది. అందుకే వర్మతో పని చేయడానికి ఒక గౌరవంగా భావించేవాళ్లు అప్పటి హీరోలు.

బాలీవుడ్ స్టార్లు సైతం వర్మతో పని చేయడానికి తహతహలాడారు. అలాంటిది ఇప్పుడాయన పరిస్థితి చూస్తే జాలి కలగక మానదు. చిన్న స్థాయి హీరోలు కూడా వర్మతో సినిమా అంటే భయపడిపోయే పరిస్థితి. నందు లాంటి వాడు సైతం వర్మతో ‘365 డేస్’ చేసినందుకు రిగ్రెట్ అయి ఉంటే ఆశ్చర్యం లేదు.

వర్మ పనైపోయిందనే చాలా ఏళ్ల కిందటే తేలిపోయినప్పటికీ.. ఆయన్ని నమ్మి కొందరు బడా తారలు సినిమాలు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అందులో ముందు చెప్పుకోవాల్సింది అమితాబ్ బచ్చన్ గురించి. అమితాబ్ దగ్గరికి పది కథలొస్తే అందులో ఒకటో రెండో మాత్రమే ఆయన ఎంచుకుంటాడు. కథలు నచ్చినా కూడా డేట్లు కేటాయించలేని పరిస్థితి. అంత బిజీగా ఉండే ఆయన వర్మతో ‘సర్కార్-3’ చేసి పరాభవాన్ని మూటగట్టుకున్నాడు. ఆయన చాలదన్నట్లు నాగార్జున సైతం వర్మతో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. ఆయనా ఫలితం అనుభవిస్తున్నాడు. తాను ‘ఆఫీసర్’ సినిమాను బాగా తీశానని నాగార్జునే ఒప్పుకున్నాడు కాబట్టి ఈ సినిమా ఆడకపోతే నాగార్జునను కూడా కొట్టాలంటూ విడుదలకు ముందు రోజు అక్కినేని అభిమానులకు పిలుపు ఇవ్వడం ద్వారా ముందే చేతులు దులిపేసుకున్నాడు వర్మ.

రిలీజ్ తర్వాత ‘ఆఫీసర్’ను అసలేం పట్టించుకోకుండా సైలెంటుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడూ అంతే. ఒక సినిమా రిలీజయ్యాక దాని ఊసే ఎత్తడు. తర్వాత ఎవరు బుట్టలో పడతారా అని చూస్తుంటాడు. మరి వర్మకు ఇప్పుడు ఎవరు దొరుకుతారో చూడాలి. ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్‌లో అందరికీ వర్మ మీద నూటికి నూరు శాతం నమ్మకం పోయింది. ఈ పరిస్థితుల్లో వర్మతో సినిమా చేయడానికి ధైర్యం చేసే మొనగాడెవరో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు