అభిమన్యుడు హిట్.. క్రెడిట్ మోహన్ బాబుదేనట

అభిమన్యుడు హిట్.. క్రెడిట్ మోహన్ బాబుదేనట

తమిళంలో అంచెలంచెలుగా పెద్ద హీరో స్థాయికి ఎదిగిన విశాల్‌కు ఒకప్పుడు తెలుగులోనూ మంచి ఫాలోయింగే ఉండేది. అతడి సినిమాలకు ఇక్కడ మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ వరుసగా రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేసి ఇక్కడ మార్కెట్ కోల్పోయాడతను. తర్వాత మంచి సినిమాలు చేసినా.. రిలీజ్ విషయంలో సరైన ప్లానింగ్ లేక దెబ్బ తిన్నాడు. నేరుగా తమిళం, తెలుగు భాషల్లో సినిమాలు రిలీజ్ చేసుకునే స్థాయి నుంచి.. తమిళంలో వచ్చినా కొన్ని నెలలకు నామమాత్రంగా తెలుగు వెర్షన్లను విడుదల చేసుకునే స్థితికి పడిపోయాడు. అప్పుడు కూడా అవేమంత ప్రభావం చూపించేవి కావు. విశాల్ చివరగా నటించిన 'డిటెక్టివ్' చాలా మంచి సినిమా అనిపించుకున్నప్పటికీ కూడా సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇక్కడ సరిగా ఆడలేదు.

ఐతే 'అభిమన్యుడు' విషయంలో విశాల్ జాగ్రత్త పడ్డాడు. మంచి టైమింగ్ చూసి.. బాగా ప్రమోట్ చేసి సినిమాను రిలీజ్ చేశాడు. దీనికి మంచి టాక్, ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమాకు మద్దతుగా టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ట్వీట్లు చేస్తూ ప్రచారం చేసి పెడుతున్నారు. మంచు విష్ణు అలాగే సినిమా గురించి మంచి మాటలు చెప్పి విశాల్‌ను అభినందించాడు. దీనికి ఆసక్తికర రీతిలో బదులిచ్చాడు విశాల్. ఈ సినిమాతో పాటు తన కెరీర్ సక్సెస్ క్రెడిట్ మోహన్ బాబుకే చెందుతుందన్నాడు. తాను హీరోగా పనికొస్తానని.. నటుణ్ని చేయమని తన తండ్రికి మొట్ట మొదటగా సలహా ఇచ్చింది మోహన్ బాబే అని వెల్లడించాడు విశాల్. ఆ మాటతోనే తన తండ్రి తనను హీరోను చేయాలని నిర్ణయించుకున్నాడన్నాడు. కాబట్టి ఇప్పుడు తానున్న ఈ స్థాయి పరోక్షంగా కారణం మోహన్ బాబే అని.. ఆయనకూ ఈ విజయంలో భాగం ఉంటుందని విశాల్ చెప్పడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు