ఇక జోరంతా డబ్బింగ్ సినిమాలదే

ఇక జోరంతా డబ్బింగ్ సినిమాలదే

నాలుగు వారాంతాల నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్‌లో 'మహానటి' జోరు సాగుతోంది. ఆ చిత్రం రెండు, మూడు వీకెండ్లలో సైతం హౌస్ ఫుల్ వసూళ్లతో ఆశ్చర్యపరిచింది. ఆ రెండు వారాలు వచ్చిన రెండు సినిమాలూ నిరాశ పరచడం దీనికి బాగా కలిసొచ్చింది. ఐతే ఈ వీకెండ్లో ఒకటికి మూడు సినిమాలు రిలీజవడంతో పరిస్థితి మారుతుందని అనుకున్నారు. కానీ అందులో రెండు సినిమాలు.. 'ఆఫీసర్', 'రాజు గాడు' తుస్సుమనిపించాయి. డబ్బింగ్ సినిమా కాబట్టి 'అభిమన్యుడు' ఏం ఆడుతుందిలే అనుకున్నారు. కానీ ఆ చిత్రానికి బాగానే కలిసొచ్చింది. మంచి టాక్‌కు తోడు.. ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. మిగతా రెండు సినిమాల నెగెటివ్ టాక్ దీనికి కలిసొస్తోంది. ఎట్టకేలకు 'మహానటి'కి కొంచెం బ్రేక్ పడేలా ఉంది. ఈ వారం బాక్సాఫీస్ లీడర్ 'అభిమన్యుడు'నే అయ్యేలా కనిపిస్తోంది. చాన్నాళ్ల తర్వాత విశాల్ తెలుగులో మంచి విజయాన్నందుకునే పరిస్థితి కనిపిస్తోంది.

విశేషం ఏంటంటే వచ్చే వారం కూడా తెలుగులో డబ్బింగ్ సినిమాల హవానే కొనసాగబోతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా 'కాలా'తో పాటు హాలీవుడ్ డబ్బింగ్ మూవీ 'జురాసిక్ వరల్డ్' కూడా ఆ వీకెండ్లోనే రిలీజ్ కాబోతున్నాయి. తెలుగు సినిమాలేవీ పోటీలో లేవు. ఆ రెండు సినిమాలకూ మంచి ఓపెనింగ్సే వచ్చే అవకాశముంది. రజినీ గత సినిమాలతో పోలిస్తే 'కాలా'కు హైప్ తక్కువే ఉంది కానీ.. అలాగని రిలీజ్ డేట్ దగ్గర పడ్డాక పరిస్థితి ఇలాగే ఉంటుందని అనుకోలేం. సూపర్ స్టార్ జనాల్ని థియేటర్లకు ఆకర్షించకుండా ఉండడు. ఇక 'జురాసిక్ వరల్డ్: ది ఫాలెన్ కింగ్‌డమ్' కోసం జనాలు చాన్నాళ్ల నుంచి ఆవురావురుమని ఎదురు చూస్తున్నారు. కాబట్టి జూన్ 13వ తేదీ వరకు టాలీవుడ్ బాక్సాఫీస్‌లో డబ్బింగ్ సినిమాల హవానే నడవబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు