వర్మకు డ్యామేజా.. హహహ

వర్మకు డ్యామేజా.. హహహ

అనుకున్నదే అయింది. రామ్ గోపాల్ వర్మ మరోసారి తన మార్కు చూపించాడు. అక్కినేని నాగార్జున లాంటి స్టార్ హీరో ఇన్నేళ్ల తర్వాత పిలిచి అవకాశమిచ్చినా మార్పు చూపించలేకపోయాడు. పదేళ్లుగా ఎంత పేలవంగా సినిమాలు తీస్తున్నాడో ‘ఆఫీసర్’ కూడా అలాగే తీశాడు. ఆయన గత సినిమాలకు, ఈ చిత్రానికి తేడా నాగార్జున మాత్రమే.

అంతకుమించి నాగ్ చెప్పినట్లుగా వర్మలో ఏ శ్రద్ధా లేదు.. ఏ బ్రిలియన్స్ కనిపించలేదు. నాగార్జునకు ఈ కథను ఎలా చెప్పి ఒప్పించాడన్న సందేహం అందరిలోనూ కలుగుతోంది. అదే సమయంలో వర్మ మాటల చాతుర్యం తెలిసిన వాళ్లకు అదేమీ ఆశ్చర్యంగా అనిపించడం లేదు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే నాగార్జునకు విషయం అర్థమైపోయి ఉండాలి. చివరగా సినిమా చూసినపుడు ఫలితం తెలిసిపోయి ఉండాలి. కానీ విడుదల ముంగిట వర్మ చాలా బాగా సినిమా తీశాడంటూ చెప్పి జనాల చెవుల్లో పువ్వులు పెట్టేశాడు నాగ్.

‘ఆఫీసర్’కు రామ్ గోపాల్ వర్మే నిర్మాత కూడా. కాబట్టి ఆయన నష్టపోతాడని.. నాగార్జున లాంటి వాడు అవకాశమిస్తే సద్వినియోగం చేసుకోలేక కెరీర్‌ను మరి ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టుకున్నాడని చాలామంది అంటున్నారు. కానీ వర్మకు ఈ సినిమా వల్ల ఏమైనా డ్యామేజ్ జరిగిందని అనుకుంటే అది తెలివి తక్కువ తనమే అవుతుంది. ‘ఆఫీసర్’ సినిమా చూసిన వాళ్లకు దీనికి వర్మ ఎంత ఖర్చు పెట్టి ఉంటాడో అంచనా వేయడం కష్టం కాదు. ఈ రోజుల్లో షార్ట్ ఫిలిమ్స్ కూడా ఇంతకంటే మెరుగైన క్వాలిటీతోనే తెరకెక్కుతున్నాయి. చిన్న స్థాయి హీరోలు.. దర్శకులు కూడా ఇంత నాసిరకం ప్రొడక్షన్ వాల్యూస్‌తో  సినిమా చేయట్లేదు.

నాగార్జునకు ఎంత పారితోషకం ఇచ్చాడో ఏమో కానీ.. సినిమాకైతే వర్మ ఒక కోటి రూపాయలైనా ఖర్చు పెట్టి ఉంటాడా అన్నది సందేహమే. పెద్ద కాస్టింగ్ లేదు. టెక్నీషియన్లందరూ వర్మ జేబులోని వాళ్లే. కాబట్టి వర్మ ఈ సినిమా వల్ల నష్టపోయేందుకు ఆస్కారమే లేదు. ఇక ఇలాంటి సినిమా తీయడం వల్ల జరిగే డ్యామేజ్ గురించి మాట్లాడుకున్నా తమాషాగానే ఉంటుంది. ‘ఐస్ క్రీమ్’.. ‘365 డేస్’ లాంటి సినిమాలు తీసిన వాడికి ఇప్పుడు ‘ఆఫీసర్’తో జరిగే డ్యామేజ్ ఏముంటుంది? స్టార్లతో పని చేయాలని వర్మకు తహతహ కూడా ఏమీ ఉండదు కాబట్టి నాగ్ ఇచ్చిన అవకాశాన్ని వృథా చేసుకున్నానే రిగ్రెట్స్ ఆయనకేమైనా ఉంటాయని అనుకోలేం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు