వివాదాస్ప‌ద ఆఫ‌ర్: స‌ల్మాన్‌ను కొడితే రూ.2ల‌క్ష‌లు

 వివాదాస్ప‌ద ఆఫ‌ర్: స‌ల్మాన్‌ను కొడితే రూ.2ల‌క్ష‌లు

వివాదాల్ని మ‌రింత వివాదాస్ప‌దంగా మార్చ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువ అవుతోంది. మ‌నోభావాల్ని దెబ్బ తీసే ప‌నులు ఎవ‌రైనా చేస్తే.. వాటిని స‌ర్దుబాటు చేయ‌టానికి.. వారు చేసిన త‌ప్పుల్ని ఎత్తి చూపించ‌టానికి చాలానే మార్గాలు ఉంటాయి. కానీ.. వాటిని వ‌దిలేసి.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. మ‌రింత వివాద‌స్ప‌ద తీరుతో వ్య‌వ‌హ‌రించ‌టం అంత‌కంత‌కూ పెరుగుతోంది. తాజాగా అలాంటిదే మ‌రొక‌టి చోటు చేసుకుంది.

స‌ల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ సంస్థ‌లో న‌వ‌రాత్రి ఉత్స‌వ నేప‌థ్యంలో రొమాంటిక్ డ్రామాగా తీస్తున్న ల‌వ‌రాత్రి మూవీ హిందువుల మ‌నోభావాల్ని కించ‌ప‌ర్చేలా ఉంద‌న్న మాట ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చింది. ఈ మూవీ టైటిల్ హిందువులు ప‌ర‌మ ప‌విత్రంగా భావించే న‌వ‌రాత్రిని కించ‌ప‌రిచేలా ఉందంటున్నారు.

హిందువుల‌ను హేళ‌న చేసేలా పెట్టిన ల‌వ‌రాత్రి టైటిల్‌ను అర్జెంట్ గా మార్చాల‌ని డిమాండ్ చేస్తోంది హిందూ హై ఆజ్ సంస్థ‌. విశ్వ‌హిందూ ప‌రిష‌త్ మాజీ అంత‌ర్జాతీయ అధ్య‌క్షుడు ప్ర‌వీణ్ తొగాడియా ఏర్పాటు చేసిన ఈ సంస్థ తాజాగా స‌ల్మాన్‌కు భారీ హెచ్చ‌రిక‌ను జారీ చేసింది.

ఈ సంస్థ ఆగ్రా న‌గ‌ర విభాగం అధ్య‌క్షుడు గోవింద్ ష‌రాష‌ర్ ఒక ప్ర‌క‌ట‌న చేస్తూ.. బ‌హిరంగంగా స‌ల్మాన్ ను కొట్టిన వారికి రూ.2ల‌క్ష‌లు బ‌హుమ‌తిగా ఇస్తామ‌ని చెబుతున్నారు. ఆగ్రాలోని భ‌గ‌వాన్ థియేట‌ర్లో ల‌వ‌రాత్రి మూవీ పోస్ట‌ర్ల‌ను ద‌హ‌నం చేసిన హిందూ హై ఆజ్ సంస్థ కార్య‌క‌ర్త‌లు.. ఈ చిత్రాన్ని అడ్డుకుంటామ‌ని చెబుతున్నారు.

ఈ మూవీలో గుజ‌రాత్ లో న‌వ‌రాత్రి ఉత్స‌వాల సంద‌ర్భంగా పండ‌గ సాగే తొమ్మిది రోజుల్లో ఒక యువ జంట మ‌ధ్య చిగురించే ప్ర‌మేను చూపించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఈ మూవీతో స‌ల్మాన్ బావ ఆయుష్ శ‌ర్మ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. మ‌రి.. ఈ మూవీ పేరును మార్చేసి ఈ వివాదానికి పుల్ స్టాప్ పెడ‌తారా?  లేక‌.. ఆ మ‌ధ్య‌న  అదే ప‌నిగా సాగిన ప‌ద్మావ‌త్ మూవీ మాదిరి వివాదాస్ప‌దం చేస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు