రెండో రోజూ పైసా బుద్ధి చూపించారుగా!

రెండో రోజూ పైసా బుద్ధి చూపించారుగా!

త‌ప్పు చేయ‌టం మాన‌వ స‌హ‌జం. బాగు ప‌డాల‌న్న ఆలోచ‌న ఉన్న వారు ఎవ‌రూ కూడా చేసిన త‌ప్పును మ‌ళ్లీ మ‌ళ్లీ చేయాల‌ని అస్స‌లు అనుకోరు. కానీ.. మోడీ స‌ర్కారు తీరు చూస్తే.. వ‌రుస తప్పులు చేస్తూ ప్ర‌జ‌ల ఆగ్ర‌హాన్ని అంత‌కంత‌కూ పెంచుకుంటున్న ప‌రిస్థితి.

దాదాపు ప‌ద‌హారు రోజుల పాటు నాన్ స్టాప్ గా డీజిల్.. పెట్రోల్ ధ‌ర‌ల్ని పెంచేసిన ఆయిల్ కంపెనీలు నిన్న (మంగ‌ళ‌వారం) ధ‌ర‌లు త‌గ్గిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించాయి. చాలా రోజుల త‌ర్వాత ధ‌ర‌లు త‌గ్గుతాయ‌న్న మాట‌తో ఎంత త‌గ్గింద‌న్న ఆస‌క్తితో చూసిన వారికి ఒళ్లు మండిపోయింది.

లీట‌రు పెట్రోల్‌.. డీజిల్ మీద ఒక్క పైసా మాత్ర‌మే త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టంపై సామాన్యులు మొద‌లు అన్ని వ‌ర్గాల వారు ఆయిల్ కంపెనీల తీరుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. నెటిజ‌న్లు అయితే పైసా త‌గ్గింపు వేసుకున్న జోకులు అన్నిఇన్ని కావు. పైసా త‌గ్గింపును పైసాచికంగా కొంద‌రు అభివ‌ర్ణిస్తే.. మ‌రికొంద‌రు ల‌క్ష‌ల కోట్ల రూపాయిలు పెట్రో ప‌న్నులు వ‌సూలు చేస్తున్న మోడీ స‌ర్కారు.. త‌గ్గింపు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి పైసా త‌గ్గిస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు.

లీట‌రుకు రెండు మూడు రూపాయిలు పెంచినా రాని వ్య‌తిరేక‌త‌.. ఆగ్ర‌హం.. పైసా త‌గ్గింపుపై రావ‌టం ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా మారింది. ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న అసంతృప్తిని గుర్తించి వెంట‌నే చ‌ర్య‌లు ప్రారంభించాల్సిన ప్ర‌భుత్వం అందుకు భిన్నంగా మౌనంగా ఉండిపోవ‌టంపై చాలామందిలో ఆగ్ర‌హాన్ని మ‌రింత పెంచేలా చేస్తోంది.

నిన్న‌టి పైసా అనుభ‌వం దృష్టిలో పెట్టుకొని అయినా.. నేడు పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల త‌గ్గింపు విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంది. అయినా.. అలాంటివేమీ ప‌ట్ట‌ద‌న్న విష‌యాన్ని తాజాగా ప్ర‌క‌టించిన ధ‌ర‌ల త‌గ్గింపు స‌మాచారంతో స్ప‌ష్ట‌మైంది. రెండోరోజు ధ‌ర త‌గ్గించిన‌ట్లుగా పేర్కొంటూ.. లీట‌రు పెట్రోల్ పై ఏడు పైస‌లు.. డీజిల్ పై ఐదు పైస‌లు త‌గ్గిస్తూ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. పైసా మిగిల్చిన చేదు అనుభ‌వం నుంచి ఆయిల్ కంపెనీలు ఎలాంటి పాఠాన్ని నేర్చుకోలేద‌న్న మాట వినిపిస్తోంది.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు