భారతీయుడు-2.. శంకర్ సంచలన నిర్ణయం?

భారతీయుడు-2.. శంకర్ సంచలన నిర్ణయం?

శంకర్ సినిమా అనగానే సంగీత దర్శకుడిగా ఎ.ఆర్.రెహమాన్ పేరు పోస్టర్ మీద ఉండాల్సిందే. తొలి సినిమా ‘జెంటిల్‌మన్’ దగ్గర్నుంచి రెహమాన్‌తోనే సాగుతున్నాడు శంకర్. మధ్యలో ‘అపరిచితుడు’.. ‘స్నేహితుడు’ సినిమాలకు మాత్రమే హారిస్ జైరాజ్‌తో మ్యూజిక్ చేయించుకున్నాడు శంకర్. అప్పుడు కూడా రెహమాన్‌కు ఖాళీ లేకపోవడంతో రెహమాన్ స్టయిల్లోనే మ్యూజిక్ ఇచ్చే అతడి శిష్యుడు హారిస్‌ను ఎంచుకున్నాడు.

‘స్నేహితుడు’ తర్వాత ఎప్పట్లాగే రెహమాన్‌తోనే కలిసి పని చేస్తున్నాడు. ‘2.0’కు కూడా రెహమానే మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే. ఐతే శంకర్ తన తర్వాతి సినిమాకు మాత్రం రెహమాన్‌తో పని చేయడం లేదని వార్తలొస్తున్నాయి. ‘2.0’ తర్వాత ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ‘భారతీయుడు’ సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే.

ఆ చిత్రానికి  యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందించబోతున్నాడట. ‘భారతీయుడు’కు రెహమానే సంగీతాన్నందించాడు. అప్పట్లో ఆ చిత్ర పాటలు.. నేపథ్య సంగీతం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యాయి. అలాంటిది సీక్వెల్‌కు రెహమాన్ పని చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. డేట్ల సమస్యతోనే రెహమాన్ ఈ ప్రాజెక్టుకు దూరమయ్యాడా లేక ఇంకేవైనా కారణాలతో శంకర్ అనిరుధ్‌ను ఎంచుకున్నాడా అన్నది తెలియదు.

అంతా అనుకున్న ప్రకారం జరిగితే భారతీయుడు-2 ఈపాటికే మొదలు కావాల్సింది. కానీ ‘2.0’ ఆలస్యం కావడంతో ఇంకా ఈ చిత్రాన్ని మొదలుపెట్టలేదు శంకర్. ఇంకో రెండు నెలల్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లొచ్చని భావిస్తున్నారు. రాజకీయ పార్టీ పెట్టిన కమల్.. చివరగా ఈ చిత్రం చేసి సినిమాల నుంచి నిష్క్రమించాలనుకుంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English