‘ఒక్క క్షణం’ వల్లే శిరీష్ కు ఆ సినిమాలో ఛాన్స్

‘ఒక్క క్షణం’ వల్లే శిరీష్ కు ఆ సినిమాలో ఛాన్స్

‘శ్రీరస్తు శుభమస్తు’తో హీరోగా తొలి విజయాన్నందుకున్న అల్లు శిరీష్.. ‘ఒక్క క్షణం’ సినిమాతో మరో మెట్టు ఎక్కుతాడని అంతా అనుకున్నారు. ఈ చిత్ర టీజర్.. ట్రైలర్ చాలా ఎగ్జైటింగ్ గా అనిపించాయి. కానీ సినిమా మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. శిరీష్ కెరీర్లో మరో ఫ్లాప్ గా నిలిచింది. అతడిని మళ్లీ కిందికి లాగేసింది.

ఐతే ‘ఒక్క క్షణం’లో శిరీష్ పెర్ఫామెన్స్ నచ్చి ఇప్పుడు అతడికి ఒక భారీ సినిమాలో అవకాశం ఇవ్వడం విశేషం. ఆ సినిమా మరేదో కాదు.. తమిళ స్టార్ హీరో సూర్య-కె.వి.ఆనంద్ కలయికలో తెరకెక్కబోయే మెగా మూవీ. ‘2.0’ను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ లో తెరకెక్కబోయే చిత్రమిది. ఈ చిత్రంలో శిరీష్ ఓ కీలక పాత్రకు ఎంపికైన సంగతి తెలిసిందే. అందులో అవకాశం రావడానికి ‘ఒక్క క్షణం’ చిత్రమే కారణమని శిరీష్ స్వయంగా వెల్లడించాడు.

సూర్యతో చేయబోయే కొత్త సినిమా కోసం ఆనంద్ కు.. శిరీష్ ను ఎవరో రెఫర్ చేశారట. ఐతే తాను ఇప్పటిదాకా శిరీష్ సినిమాలు చూడలేదని అనగా.. ఆయనకు ‘ఒక్క క్షణం’ డీవీడీ పంపించారట. అందులో శిరీష్ నటన చూసి ఇంప్రెస్ అయిన ఆనంద్.. వెంటనే తన సినిమాకు అతడిని ఓకే చేశాడట. ఇలా ‘ఒక్క క్షణం’ తనకు ఒక భారీ సినిమాలో అవకాశం తెచ్చిపెట్టిందంటూ సంతోషంగా చెప్పుకొచ్చాడు శిరీష్.

ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం ఒక కీలక పాత్ర చేస్తుండటం విశేషం. ఆయనతో ఇప్పటికే మలయాళంలో ‘1971’ అనే సినిమా చేశాడు శిరీష్. ఇప్పుడు లాల్-సూర్యలిద్దరితో కలిసి నటించబోతుండటం విశేషమే. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అనువదించి రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు శిరీష్ హీరోగా ‘ఏబీసీడీ’ అనే సినిమా తెరకెక్కబోతోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు