మహేష్ ఈజ్ బ్యాక్

మహేష్ ఈజ్ బ్యాక్

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ‘భరత్ అనే నేను’ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరుసగా రెండు ఆల్ టైం డిజాస్టర్ల తర్వాత తీవ్ర ఒత్తిడిలో ఉండగా మహేష్ ఈ సినిమాతో విజయాన్నందుకున్నాడు. ఈ సినిమా మహేష్ కు ఎంత సంతోషాన్నిచ్చిందో అతడి మాటల్లో స్పష్టంగా కనిపించింది. ‘భరత్ అనే నేను’ విజయాన్ని ఆస్వాదిస్తూనే.. ఫ్యామిలీతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్. వేసవి తాపం తగ్గగానే.. ఇంకొన్ని రోజుల్లోనే మహేష్ మళ్లీ పనిలో పడిపోనున్నాడు.

అతడి కెరీర్లో మైలురాయి అనదగ్గ చిత్రం జూన్ రెండో వారంలో మొదలుకాబోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు.. అశ్వినీదత్ కలిసి నిర్మించబోతున్నారు. ఇది మహేష్ కెరీర్లో 25వ సినిమా కావడం విశేషం.

దీన్ని మహేష్ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడు. అందుకే క్రేజీ కాంబినేషన్ సెట్ చేసుకున్నాడు. ‘ఊపిరి’ సినిమాతో మెప్పించిన వంశీ.. ఆ తర్వాత హడావుడి పడకుండా మూడేళ్లుగా మహేష్ సినిమా మీదే పని చేస్తున్నాడు. కొన్ని రోజుల కిందటే బౌండెడ్ స్క్రిప్టు రెడీ అయిందట. ప్రి ప్రొడక్షన్ పనులు కూడా ఓ కొలిక్కి వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఎక్కువగా అమెరికాలో.. నార్త్ ఇండియాలో చిత్రీకరించనున్నట్లు సమాచారం.

గత ఏడాదే ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేసేశాడు వంశీ. ఇందులో పూజా హెగ్డే మహేష్ కు జోడీగా నటించబోతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి మహేష్ 25వ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలన్నది ప్లాన్. ఆరు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేస్తారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు