2.0.. ఇంత నిర్లక్ష్యమా?

2.0.. ఇంత నిర్లక్ష్యమా?

‘రోబో’ సీక్వెల్ ‘2.0’ను శంకర్ మొదలుపెట్టి మూడేళ్లు దాటిపోయింది. ఈ చిత్ర షూటింగ్ ముగించి దాదాపు ఏడాదవుతోంది. కానీ ఇంకా సినిమా విడుదలకు నోచుకోలేదు. కనీసం ఎప్పుడు రిలీజవుతుందన్న సమాచారం కూడా లేదు. ఇలాంటి భారీ సినిమాలకు సంబంధించిన పనులు అనుకున్న ప్రకారం జరగవన్న సంగతి అర్థం చేసుకోదగ్గదే. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ దగ్గర ఆలస్యం జరుగుతుంది. ‘బాహుబలి’ విషయంలోనూ ఇలాగే జాప్యం జరిగింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ను 2015 మేలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అది జులై 10కి కానీ విడుదల కాలేదు. ఇక ‘ది కంక్లూజన్’ను 2016లోనే రిలీజ్ చేస్తామని ప్రకటించి చివరికి 2017 ఏప్రిల్ 28 విడుదల చేశారు. ఈ తరహాలోనే ‘2.0’ కూడా డేట్లు మార్చుకుంటూ వచ్చింది. గత ఏడాది దీపావళికే అనుకున్న ఈ చిత్రం ఇంకా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

సినిమాను వాయిదా వేస్తే వేశారు కానీ.. అసలేం జరుగుతోంది సమస్య ఏంటి అనే విషయంలో ‘2.0’ టీం నుంచి ఏ అప్ డేట్ ఉండట్లేదు. చివరగా ఏప్రిల్లో సినిమా రిలీజవుతుందంటూ ఫిబ్రవరిలో ప్రెస్ నోటి ఇచ్చింది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. అంతే.. ఇక ఆపై ఉలుకూ పలుకూ లేదు. ఏప్రిల్ వచ్చింది వెళ్లింది. సినిమాను ఈ నెలలో రిలీజ్ చేయలేకపోతున్నామనీ చెప్పలేదు. ఆ తర్వాత ఎప్పుడు రిలీజ్ చేయొచ్చనే సమాచారమూ ఇవ్వలేదు. రజినీ ఏమో.. రాజకీయాలు, తన తర్వాతి సినిమా మీద ఫోకస్ పెట్టాడు. శంకరేమో ‘భారతీయుడు-2’ మీద ఫోకస్ పెట్టాడంటున్నాడు. లైకా వాళ్లేమో వేరే రెండు మూడు సినిమాల్ని లైన్లో పెట్టారు.

‘2.0’కు సంబంధించిన పనులు ఏమేరకు నడుస్తున్నాయి.. అవి ఎంత వరకు వచ్చాయి.. రిలీజ్ ఎప్పుడు సాధ్యమవుతుందనే విషయంలో ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కి భారీ అంచనాలున్న సినిమా పరిస్థితి ఇది. సినిమాను రెడీ చేసే విషయంలో వాళ్ల కష్టాలు వాళ్లకుంటాయి. కానీ ఇలాంటి మోస్ట్ అవైటెడ్ సినిమాకు సంబంధించి ప్రేక్షకులతో అంతో ఇంతో సమాచారం అయినా పంచుకోకుండా చిత్ర బృందం ఇలా సైలెంటుగా ఉండటమేంటో అర్థం కావడం లేదు. ఒక రకంగా ఇది బాధ్యతా రాహిత్యమనే అనుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు