వైజాగ్ రోడ్లు రాజమౌళిని కట్టి పడేశాయి

వైజాగ్ రోడ్లు రాజమౌళిని కట్టి పడేశాయి

‘బాహుబలి’తో ఇండియన్ సినిమా కీర్తి పతాకను ప్రపంచ స్థాయిలో ఎగురవేసిన రాజమౌళి దేశవ్యాప్తంగా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆయన మాటకు చాలా విలువ పెరిగింది. రాజమౌళి ఎవరికైనా సర్టిఫికెట్ ఇస్తే వాళ్ల ఆనందం మామూలుగా ఉండదు.

ఇప్పుడు విశాఖపట్నం నగర అభివృద్ధి సంస్థ (వుడా) అధికారులు కూడా జక్కన్న తమకిచ్చిన కితాబు చూసి సంబరపడిపోతున్నారు. రాజమౌళి తాజాగా విశాఖపట్నం వెళ్లాడట. అక్కడ కార్లో వెళ్తూ రోడ్ల అందాల్ని చూసి ఫిదా అయిపోయాడు. చాన్నాళ్ల తర్వాత వైజాగ్ వచ్చానని.. ఇక్కడి రోడ్లు చాలా పరిశుభ్రంగా.. పచ్చదనంతో నిండి ఉన్నాయని.. చాలా సమర్థవంతంగా వీటిని నిర్వహిస్తున్నారని.. ఇందుకు వుడాను అభినందిస్తున్నానని రాజమౌళి ట్వీట్ చేశాడు.

కొన్నేళ్ల కిందట హుద్ హుద్ తుపాను భీభత్సంతో కకావికలమైన విశాఖ నగరాన్ని చాలా వేగంగా మళ్లీ పూర్వ స్థితికి తెచ్చారు. ఆ తర్వాత నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దారు. విశాఖ రోడ్లను మెయింటైన్ చేసే తీరు.. అక్కడి పచ్చదనంపై గతంలోనూ ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు రాజమౌళి అంతటి వాడు సర్టిఫికెట్ ఇచ్చేసరికి అందరి దృష్టీ అటు మళ్లింది. జక్కన్న ట్వీట్ చూపిస్తూ వైజాగ్ వాసులు.. అక్కడి అధికారులు గొప్పగా చెప్పుకుంటున్నారు.

 ఐతే ఇప్పుడు రాజమౌళి విశాఖపట్నానికి ఎందుకెళ్లాడనే చర్చ మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కించబోయే చిత్రానికి సంబంధించి లొకేషన్ల వేట కోసం ఏమైనా వైజాగ్ వెళ్లాడా లేక ఏదైనా వ్యక్తిగత కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడికి చేరుకున్నాడా అన్నదానిపై జనాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు