కన్నడ టాలెంటుని పట్టుకొచ్చిన అల్లు కుర్రాడు

కన్నడ టాలెంటుని పట్టుకొచ్చిన అల్లు కుర్రాడు

‘గౌరవం’.. ‘కొత్త జంట’ లాంటి ఫ్లాపుల తర్వాత ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో అల్లు శిరీష్ కెరీర్ గాడిన పడ్డట్లే కనిపించింది. కానీ ‘ఒక్క క్షణం’ మళ్లీ అతడిని వెనక్కి లాగేసింది. భిన్నమైన కాన్సెప్టుతో ఆకర్షించింది కానీ..  సినిమా మాత్రం  ఆసక్తికరంగా లేకపోవడంతో ప్రేక్షకులు తిప్పికొట్టారు. ఆ తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియని సందిగ్ధంలో పడ్డ శిరీష్.. ఎట్టకేలకు ఇటీవలే ‘ఏబీసీడీ’ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఇది మలయాళంలో అదే పేరుతో విజయవంతమైన సినిమాకు రీమేక్ ఆట. సంజీవ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. మధుర శ్రీధర్ రెడ్డి.. యాష్ రంగినేని నిర్మాతలు. ఈ చిత్రం కోసం కన్నడ నుంచి ఓ యువ సంగీత దర్శకుడిని తీసుకొస్తున్నారు. అతడి పేరు.. జుదా శాందీ.

చమక్.. బద్మాష్.. ఆపరేషన్ అలమేలమ్మ.. లాంటి సినిమాలతో జుదా కన్నడలో మంచి పేరే సంపాదించాడు. గత కొన్నేళ్లలో కన్నడ సినిమాకు పరిచయమైన మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో అతనొకడని చెప్పొచ్చు. ‘చమ్మక్’ అనే సినిమా నుంచి తన ఫ్రెండు ఒక పాట పంపిస్తే దాని సరదాగా విని.. ఫిదా అయిపోయాడట శిరీష్. తర్వాత జుదా మిగతా సినిమాల పాటలు కూడా విన్నాడట. ఇంప్రెస్ అయిపోయి దర్శకుడు సంజీవ్ కు కూడా ఆ పాటలు వినిపించగా అతను కూడా ఓకే చెప్పాడు.

వెంటనే శిరీష్ నేరుగా జుదాకు ఫోన్ చేసి తన సినిమాకు పని చేయమని ఆఫర్ చేశాడట. ముందు ఇదేదో ప్రాంక్ కాల్ అనుకున్న జుదా.. తర్వాత నిజంగానే శిరీషే తనతో మాట్లాడుతున్నాడని తెలుసుకుని అతడి చిత్రానికి ఓకే చెప్పాడట. ఇంకా ఈ సినిమా మొదలే కాలేదు. అప్పుడే అతను రెండు పాటలు కూడా కంపోజ్ చేసినట్లు శిరీష్ వెల్లడించాడు. శిరీష్ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారమే ఈ చిత్రాన్ని లాంచ్ చేస్తారని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు