తేజూను రక్షించడానికి ఆయన మళ్లీ..?

తేజూను రక్షించడానికి ఆయన మళ్లీ..?

తన తొలి సినిమాగా ‘రేయ్’ను ఎంచుకుని కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకున్నాడు మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్. ఆ సినిమా ఎంతకీ పూర్తి కాక, రిలీజ్‌కు నోచుకోక.. తేజు అయోమయంలో పడిపోయిన స్థితిలో అల్లు అరవింద్ అతడిని రక్షించే బాధ్యత తీసుకున్నాడు. దిల్ రాజుతో కలిసి ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా చేశాడు. ఆ సినిమా మంచి ఫలితాన్నందుకుని తేజుకు లైఫ్ ఇచ్చింది. ఆ తర్వాత ఇంకో రెండు హిట్లతో స్టార్ అయ్యే దిశగా అడుగులేశాడు తేజు.

కానీ ఆపై వేసిన తప్పటడుగులు తేజు కెరీర్ ను మళ్లీ డ్యామేజ్ చేశాయి. వరుసగా ఐదు డిజాస్టర్లతో ప్రస్తుతం మెగా మేనల్లుడి పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పుడతను నటిస్తున్న ‘తేజ్ ఐలవ్యూ’ మీద కూడా అంచనాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. సరైన గైడెన్స్ లేకే తేజు పరిస్థితి అలా తయారైందని.. మెగా ఫ్యామిలీ అతడిని పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తేజు కోసం అల్లు అరవింద్ మరోసారి రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.

గీతా ఆర్ట్స్ బేనర్లో తేజు మరోసారి నటించబోతున్నాడట. ఇందుకు అంగీకారం కుదిరిందట. ప్రస్తుతం దర్శకుడు.. కథ వేటలో ఉన్నట్లు సమాచారం. కథ కుదిరితే.. గీతా టీంతో బాగా కసరత్తు చేయించి స్యూర్ షాట్ హిట్ అనేలా స్క్రిప్టు తయారయ్యాక ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్తారట. తక్కువ బడ్జెట్లోనే ఈ చిత్రాన్ని చేయాలనుకుంటున్నారు. గీతాలో చేస్తే కెరీర్ మళ్లీ పుంజుకుంటుందని తేజు ఆశగా చూస్తున్నాడట. ‘తేజ్ ఐ లవ్యూ’ తర్వాత అతను కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దాని తర్వాత గీతా ఆర్ట్స్ సినిమా మొదలయ్యే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు