ఆ సినిమాకు హీరో పారితోషకం 450 కోట్లు

ఆ సినిమాకు హీరో పారితోషకం 450 కోట్లు

రూ.450 కోట్లు.. ఇంకా ఇండియన్ సినిమా బడ్జెట్ కూడా ఈ రేంజికి చేరలేదు. ‘బాహుబలి’ రెండు భాగాలు కలిపితే ఇంత ఖర్చయిందని అంటారు. ఇక రజనీకాంత్ ‘2.0’ బడ్జెట్ రూ.400 కోట్లని ప్రచారం జరుగుతోంది. ఐతే రూ.450 కోట్లు ఒక హీరోకు పారితోషకంగా ఇస్తున్నారంటే నమ్మగలరా? ఇది ప్రపంచ సినీ చరిత్రలోనే రికార్డు. రికార్డు స్థాయిలో ఈ పారితోషకం అందుకోబోతున్న హీరో మరెవరో కాదు.. డేనియల్ క్రెయిగ్.

ఇతనెవరో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. దశాబ్ద కాలంగా జేమ్స్ బాండ్ పాత్రలతో అలరిస్తున్న హీరో ఇతనే. క్యాసినో రాయల్.. క్వాంటమ్ ఆఫ్ సోలెస్.. స్పెక్టర్.. స్కై ఫాల్.. ఈ నాలుగు బాండ్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని అలరించాడు ఈ హీరో. ‘స్కై ఫాల్’తో ఇక బాండ్ సినిమాలకు గుడ్ బై చెప్పేయాలని అతను భావించాడు.

కానీ బాండ్ సినిమాల ప్రొడక్షన్ హౌస్ క్రెయిగ్ ను వదులుకోవడానికి ఇష్టపడలేదు. అతడికి భారీ పారితోషకం ఆఫర్ చేసి ఆపింది. ఈ చిత్రానికి క్రెయిగ్ 50 మిలియన్ పౌండ్లు.. అంటే దాదాపు రూ.450 కోట్లు పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం. ఈ వార్త నిజమైతే ప్రపంచ సినీ చరిత్రలోనే ఒక సినిమాకు అత్యధిక పారితోషకం అందుకున్న హీరోగా క్రెయిగ్ రికార్డు సృష్టిస్తాడు. విశేషం ఏంటంటే.. బాండ్ కొత్త చిత్రానికి డానీ బోయెల్ దర్శకత్వం వహించబోతున్నాడు.

అతను ఇండియా నేపథ్యంగా ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమా తీసి బోలెడన్ని ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టాడు. ఈ చిత్రం డిసెంబర్లో సెట్స్ మీదికి వెళ్లనుంది. 2019 చివర్లో ప్రేక్షకుల ముందుకు తేవాలన్నది ప్లాన్. నటీనటుల ఎంపికతో పాటు ప్రి ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు