సంక్రాంతి సమరం రసవత్తరం

సంక్రాంతి సమరం రసవత్తరం

వరుసగా కొన్నేళ్లుగా సంక్రాంతి సమరం మోతెక్కిపోతూ వచ్చింది. కానీ ఈ ఏడాది ఆ పండగ రుచి పచి లేకుండా తయారైంది. ‘అజ్ఞాతవాసి’ తుస్సుమనిపిస్తే.. ‘జై సింహా’ కూడా అంతంతమాత్రంగా అనిపించింది. ఇక ఆ పండక్కి షెడ్యూల్ అయిన వేరే పెద్ద సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి. మొత్తంగా సంక్రాంతి కళ తప్పింది. ఐతే 2019 సంక్రాంతి మాత్రం తెలుగు సినీ ప్రియులకు అమితానందాన్నివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పండక్కి షెడ్యూల్ అయిన సినిమాలు మామూలువి కావు.టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలవి. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ కాగా.. మరొకటి నందమూరి బాలకృష్ణ నటించబోయే ‘యన్.టి.ఆర్’. ఇంకోటి మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమా.


‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత సేఫ్ జోన్ నుంచి బయటికి వచ్చి ‘సైరా’ లాంటి మెగా మూవీలో నటిస్తున్నాడు. గత ఏడాదే షూటింగ్ ఆరంభించుకున్న ఈ చిత్రం ఇప్పటికే సగం పూర్తయినట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబరుకల్లా దీని షూటింగ్ మొత్తం అయిపోతుందట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక దసరాకే అనుకున్న బాలయ్య సినిమా ‘యన్.టి.ఆర్‌’కు అనివార్య కారణాల వల్ల బ్రేక్ పడింది. తేజ తప్పుకోవడంతో సినిమా ఆగిపోయినట్లు కనిపించింది. ఐతే క్రిష్ రాకతో మళ్లీ ఊపొచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు బాలయ్య ఈ రోజే ప్రకటించాడు. ఇక మహేష్ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని ఆ చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. గత ఏడాది ‘ఖైదీ..’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలతో చిరు-బాలయ్య పోరు సంక్రాంతికి కళ తెచ్చింది. వచ్చే ఏడాది వాళ్లిద్దరితో పాటు మహేష్ కూడా సంక్రాంతి రేసులో నిలుస్తుండటంతో సందడి మామూలుగా ఉండదన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు