ఈ శుక్రవారం ముక్కోణపు సమరమే

ఈ శుక్రవారం ముక్కోణపు సమరమే

మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ శుక్రవారం రిలీజయ్యే సినిమాలేవో తేలిపోయింది. ఈ వీకెండ్లో ముక్కోణపు పోరు చూడబోతున్నాం. అక్కినేని నాగార్జున సినిమా ‘ఆఫీసర్’తో పాటు రాజ్ తరుణ్ మూవీ ‘రాజుగాడు’.. విశాల్ డబ్బింగ్ చిత్రం ‘అభిమన్యుడు’ శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర తలపడబోతున్నాయి. ఈ వారానికి ‘నా నువ్వే’ కూడా షెడ్యూల్ అయి ఉన్నప్పటికీ అది అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. మిగతా రెండు తెలుగు సినిమాల విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. ‘ఆఫీసర్’కు వేరే ఏవో అడ్డంకులు ఉండటంతో దీన్ని వాయిదా వేస్తారన్న ప్రచారం జరిగింది. మరోవైపు ‘రాజుగాడు’ చాన్నాళ్ల ముందే జూన్ 1కి ఫిక్సయినప్పటికీ పోటీని బట్టి రేసు నుంచి తప్పుకుందామని చూశాడు నిర్మాత అనిల్ సుంకర. కానీ చివరికి ఈ రెండు సినిమాలూ ఈ శుక్రవారానికే ఫిక్సయ్యాయి.


విశేషం ఏంటంటే రాజ్ తరుణ్ చివరి సినిమా ‘రంగులరాట్నం’ను నిర్మించింది నాగార్జునే. ఆ చిత్రం సంక్రాంతికి రిలీజై తుస్సుమనిపించింది. ఇప్పుడు నాగ్‌తో బాక్సాఫీస్ దగ్గర తలపడబోతున్నాడు తరుణ్. ఈ రెండు సినిమాల మీద మరీ అంచానలైతే లేవు. రామ్ గోపాల్ వర్మ ట్రాక్ రికార్డు పుణ్యమా అని ‘ఆఫీసర్’కు అంతగా బజ్ రాలేదు. ఇక రాజ్ తరుణ్ హిట్టు ముఖం చూసి చాన్నాళ్లవడంతో ‘రాజు గాడు’ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. డబ్బింగ్ సినిమానే అయినప్పటికీ ‘అభిమన్యుడు’ నుంచి వీటికి ముప్పు పొంచి ఉంది. ఆ చిత్రం తమిళంలో ఇప్పటికే పెద్ద విజయం సాధించింది. విశాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అది బలమైన కంటెంట్ ఉన్న సినిమా. ‘ఆఫీసర్’.. ‘రాజు గాడు’లకు టాక్ తేడా వస్తే మాత్రం దీనికి అడ్వాంటేజ్ అవుతుంది. సమంత, అర్జున్ కీలక పాత్రలు చేయడం దీనికి కలిసొచ్చే అంశం. మరి ఈ శుక్రవారం బాక్సాఫీస్ విజేత ఎవరో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు