మరి క్రిష్ రాజీ పడతాడా?

మరి క్రిష్ రాజీ పడతాడా?

దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కబోయే ‘యన్.టి.ఆర్’ సినిమాకు దర్శకుడెవరో తేలిపోయింది. ‘గమ్యం’.. ‘కంచె’.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి అద్భుత చిత్రాల్ని రూపొందించిన క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడని తేలిపోయింది. ఎన్టీఆర్ జయంతి ముంగిట ఈ విషయాన్ని ప్రకటించి అందరిలోనూ సంతోషాన్ని నింపాడు బాలయ్య. ఒక దశలో ఈ ప్రాజెక్టు మీద పూర్తిగా ఆసక్తి కోల్పోయిన వాళ్లందరికీ ఒక్కసారిగా ఊపొచ్చింది. ఏ సినిమానైనా చాలా శ్రద్ధగా తీస్తాడని క్రిష్‌కు పేరుంది. అతడిలో ఒక సిన్సియారిటీ కనిపిస్తుంది. ఫలితం గురించి ఆలోచించకుండా ప్రయత్నాన్ని నూటికి నూరు శాతం చేస్తాడు క్రిష్. అలాంటివాడు ఎన్టీఆర్ లాంటి యుగ పురుషుడి సినిమా తీయబోతున్నాడంటే అందరిలోనూ ఒక ఉద్వేగం కలుగుతోంది.


ఐతే ఎన్టీఆర్ కథను క్రిష్ ఎలా చెబుతాడు.. ఎంతవరకు చెబుతాడన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది. ఎన్టీఆర్ జీవితాన్ని ఉన్నదున్నట్లు పూర్తిగా చూపించడం మాత్రం అసాధ్యం. అందుకు నందమూరి కుటుంబం అంగీకరించే పరిస్థితి లేదు.
ముఖ్యంగా బాలయ్యే అందుకు అడ్డం పడతాడు. తన బావ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బాలయ్య ఇబ్బంది కలిగిస్తాడని అనుకోలేం. ఆ మాటకొస్తే మొత్తం ఉన్నదున్నట్లు చూపిస్తే నందమూరి కుటుంబానికే సమస్యలు తప్పవు. కాబట్టి అందరూ అనుకుంటున్నట్లే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం.. లేదా నాదెండ్ల వెన్నుపోటు తర్వాత తిరిగి పదవి అందుకోవడం వరకు చూపించి ఆపేయొచ్చు. ఇక్కడిదాకే చూపిస్తే సినిమాలో డ్రామా తక్కువగా ఉంటుంది. అన్నీ పాజిటివ్ విషయాలే చూపించి సినిమాను రక్తి కట్టించాలి. క్రిష్ కొంత రాజీ పడక తప్పదు. మరి ఇలాంటి పరిమితుల మధ్య క్రిష్ ఈ చిత్రాన్ని ఏమేరకు రంజింపజేసేలా తీయగలడన్న సందేహాలూ లేకపోలేదు. క్రిష్ మీద ఉన్న గౌరవంతో బాలయ్య కొంత వెసులుబాటు ఇచ్చి కొన్ని విషయాల్ని విడిపించి విడిపించనట్లు చూపించి కథను ఇంకొంత దూరం చూపించడానికి అంగీకరిస్తాడేమో చూడాలి. ఐతే ఒక్కటి మాత్రం వాస్తవం.. ఎన్టీఆర్ కథను కొంచెం కళాత్మకంగా.. భావోద్వేగాలతో చెప్పగల నేర్పు మాత్రం క్రిష్ నుంచి ఆశించొచ్చు. అక్కడి వరకు కొంత ఆనందమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు