‘నేల టిక్కెట్టు’ డిజాస్టర్ కాదు

‘నేల టిక్కెట్టు’ డిజాస్టర్ కాదు

ఇంతకుముందు సినిమా ఆడకపోతే ఫ్లాప్ అనేవాళ్లు. మరీ చెత్తగా ఉంటే అట్టర్ ఫ్లాప్ అనేవాళ్లు. సినిమా ఆడే రోజుల్ని బట్టి ఫ్లాపా.. అట్టర్ ఫ్లాపా అనేది నిర్ణయించేవాళ్లు. కానీ తర్వాత కలెక్షన్లే ప్రామాణికం అయ్యాయి. వసూళ్లను బట్టి మాట మారింది. డిజాస్టర్ అనే మాట కొత్తగా అలవాటైంది. వసూళ్లు మరీ దారుణంగా ఉండి.. వీకెండ్ అవ్వగానే సినిమా పనైపోతే దాన్ని డిజాస్టర్ అంటున్నారు.  రవితేజ కొత్త సినిమా ‘నేల టిక్కెట్టు’ను మొదట్నుంచి అందరూ డిజాస్టర్ అంటున్నారు. కానీ ఈ సినిమా ఫలితాన్ని అంతటితో పరిమితం చేయడం కష్టంగానే అనిపిస్తోంది. ఎందుకంటే బాక్సాఫీస్ దగ్గర ఆ చిత్ర పరిస్థితి చూస్తుంటే డిజాస్టర్ అనే పదం చిన్నగా అనిపిస్తోంది. దీన్ని డబుల్ డిజాస్టర్ అనో.. ఎపిక్ డిజాస్టర్ అనో అనాల్సి వస్తోంది. కంటెంట్.. బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ కోణంలో చూస్తే రవితేజ కెరీర్ మొత్తంలో అత్యంత చెత్త సినిమాల్లో ఇదొకటి అయ్యేలా కనిపిస్తోంది.

తొలి రోజు మార్నింగ్ షోతోనే నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది ఈ చిత్రానికి. సాయంత్రానికే వసూళ్లు పడిపోయాయి. గత ఏడాది ‘రాజా ది గ్రేట్’ టైంలో రవితేజ తొలి రోజు రూ.7-8 కోట్ల మధ్య ఓపెనింగ్స్ సాధించే స్థితిలో ఉన్నాడు. అలాంటిది ‘నేల టిక్కెట్గు’కు ఫస్ట్ డే మూడున్నర కోట్ల షేర్ వచ్చిందంతే. ఇక శని, ఆదివారాల్లో ఆ చిత్రానికి చెప్పుకోదగ్గ షేర్ ఏమీ రాలేదు. మొత్తం షేర్ ఇంకా రూ.6 కోట్ల లోపే ఉంది. బయ్యర్ల పెట్టుబడిలో మూడో వంతు మాత్రమే వసూలు చేసిందీ చిత్రం. దీన్ని బట్టే ఇది ఏ రేంజ్ డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు. వీకెండ్ తర్వాత ఈ చిత్రానికి మినిమం బుకింగ్స్ లేవు. బుకింగ్ వెబ్ సైట్లు తెరిస్తే మొత్తం థియేటర్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. థియేటర్ల దగ్గరా టికెట్లు తెగట్లేదు. మాస్ రాజా పరిస్థితి మరీ ఇంత దయనీయంగా తయారవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు