పవన్‌ కోసం మొదలై ఎన్టీఆర్‌ వైపు

పవన్‌ కోసం మొదలై ఎన్టీఆర్‌ వైపు

ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ సినిమా అనుకున్నపుడు అచ్చమైన ఫ్యామిలీ డ్రామా తీద్దామని అనుకున్నారు. 'నువ్వు నాకు నచ్చావ్‌' తరహాలో సినిమా చేయాలని ఎన్టీఆర్‌ కోరగా, త్రివిక్రమ్‌ అలాంటి కథనే రెడీ చేసుకున్నాడు. కానీ అజ్ఞాతవాసి ఫ్లాప్‌ అవడంతో త్రివిక్రమ్‌ ఆలోచన మారింది. ఎన్టీఆర్‌పై ఫ్యామిలీ డ్రామా తీసి రిస్క్‌ చేయడం కంటే అతని మాస్‌ ఇమేజ్‌కి తగ్గట్టు కథ రాసుకుంటే మంచిదని 'అరవింద సమేత... వీర రాఘవ' సిద్ధం చేసాడు. ముందుగా ఈ కథకి రాయలసీమ నేపథ్యం లేదు. అజ్ఞాతవాసి తర్వాత ఎన్టీఆర్‌ కోసం రాసిన కథకి జరిగిన మార్పులలో భాగంగా ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ వచ్చి చేరింది.

అయితే ఫ్యాక్షన్‌ సినిమా తీయాలనేది త్రివిక్రమ్‌కి ఇప్పుడు పుట్టిన ఆలోచన కాదు. పవన్‌కళ్యాణ్‌తో 'కోబలి' తీద్దామని త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేసుకున్నాడు. అప్పుడు చేసిన రీసెర్చిలో భాగంగా వచ్చిన నాలెడ్జ్‌తో 'అరవింద సమేత'లో రాయలసీమ మాండలికం, పద్ధతులు, కట్టుబాట్లు అన్నీ జోడిస్తున్నారు. రాయలసీమ మాండలికంపై పట్టు లేకపోయినా కొందరు రచయితల సాయంతో త్రివిక్రమ్‌ దీనిని అచ్చమైన సీమ సినిమాగా తీర్చిదిద్దుతున్నాడు.

ఈమధ్య కాలంలో ప్రాంతీయ కట్టుబాట్లకి తగ్గ కథలు వచ్చినపుడు అన్ని ప్రాంతాల ప్రజలు ఆదరిస్తున్నారు. సీమ నేపథ్యం తెలుగు సినిమాకి కొత్త కాకపోయినా కానీ అచ్చంగా అక్కడి సంస్కృతిని హైలైట్‌ చేసిన సినిమాలైతే రాలేదు. త్రివిక్రమ్‌ అలాంటి సహజమైన వాతావరణానికి కమర్షియల్‌ సూత్రాలని జోడిస్తే విజయం తథ్యం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు