‘మహానటి’కి మినహాయింపు.. గుణశేఖర్ లైన్లోకొచ్చాడు

‘మహానటి’కి మినహాయింపు.. గుణశేఖర్ లైన్లోకొచ్చాడు

మూడేళ్ల కిందట గుణశేఖర్ తీసిన ‘రుద్రమదేవి’ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పన్ను మినహాయింపు ఇవ్వడం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతడి విన్నపాన్ని తిరస్కరించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సినిమా‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి మాత్రం ఆగమేఘాల మీద పన్ను మినహాయింపు కల్పించడంతో గుణశేఖర్‌కు మండిపోయి తెలుగుదేశం ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించాడు.

తాను పన్ను మినహాయింపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టించుకోకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘శాతకర్ణి’కి మాత్రం ఎలా ఆ సౌలభ్యం కల్పిస్తారని ప్రశ్నించాడు. దీనిపై పెద్ద డిస్కషనే నడిచింది అప్పట్లో. ఈ గొడవను దృష్టిలో ఉంచుకుని ఒక వేడుకలో గుణశేఖర్‌తో బాలయ్య అవమానకర రీతిలో వ్యవహరించడమూ గుర్తుండే ఉంటుంది.

ఆ సంగతలా వదిలేస్తే ఇప్పుడు అశ్వినీదత్ నిర్మాణంలో వచ్చిన ‘మహానటి’కి పన్ను మినహాయింపు ఇస్తామంటూ స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. ఈ మేరకు దత్ ఏమీ విజ్ఞప్తి చేసుకోలేదు. పైగా తమ సినిమాకు పన్ను మినహాయింపు వద్దని.. చంద్రబాబు సర్కారు రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న నేపథ్యంలో తామే ఎదురుగా రూ.50 లక్షలు విరాళం ఇవ్వదలుచుకున్నామని దత్ ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. చంద్రబాబు మాత్రం తాము ‘మహానటి’కి మినహాయింపు ఇస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించేశారు.

దీనిపై గుణశేఖర్ స్పందించడం విశేషం. ఐతే ఆయన వ్యాఖ్యలేమీ చేయకుండా కేవలం దండం పెడుతున్న ఒక ఇమోజీ మాత్రం పెట్టాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాల మరి. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందిస్తున్నట్లా? లేక నేను అంత పోరాడితే పట్టించుకోలేదు.. ఈ సినిమాకు మాత్రం మినహాయింపు ఇస్తారా అని వెటకారం ప్రదర్శిస్తున్నట్లా? ఐతే దత్ తెలుగు దేశానికి గట్టి మద్దతుదారు.. తనకు కావాల్సిన వాడు కాబట్టి చంద్రబాబు ఆయన మీద ప్రత్యేక ప్రేమ చూపించిన మాట మాత్రం వాస్తవమని అంగీకరించాల్సిందే. అదే సమయంలో గుణశేఖర్‌కు అన్యాయం చేసిన మాటా వాస్తవమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు