త్రివిక్రమ్ మెచ్చిన త్రివిక్రమ్ డైలాగులు

త్రివిక్రమ్ మెచ్చిన త్రివిక్రమ్ డైలాగులు

త్రివిక్రమ్ శ్రీనివాస్.. అభిమానులు మాటల మాంత్రికుడిగా పిలుచుకునే గొప్ప తెలుగు సినిమా రచయిత. అందరూ ఆయన్ని పొగడ్డమే తప్ప.. ఆయన తన గురించి తాను ఎప్పుడూ మాట్లాడుకోడు. త్రివిక్రమ్ డైలాగుల్లో నచ్చినవి చెప్పమంటే వందల కొద్దీ చెబుతారు అభిమానులు. మరి త్రివిక్రమ్ డైలాగుల్లో త్రివిక్రమ్‌కు నచ్చినవి ఏవి? ఆయన బాగా ఇష్టపడి రాసి.. రాశాక మంచి అనుభూతిని పొందిన డైలాగులేవి? ఈ ప్రశ్నలకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో సమాధానం చెప్పాడు త్రివిక్రమ్.

‘అతడు’ సినిమాలో అబద్ధానికి.. మోసానికి తేడా చెప్పాల్సిన సందర్భంలో ఏం డైలాగ్ రాయాలా అని త్రివిక్రమ్ బాగా మథన పడ్డాడట. చివరికి ‘నిజం చెప్పకపోవడం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం’ అంటూ డైలాగ్ తట్టగానే భలే మంచి మాట చెప్పామే అనిపించిందని త్రివిక్రమ్ తెలిపాడు. ఇక ‘అత్తారింటికి దారేది’లో ‘కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం చేసేవాడిని’ అనే డైలాగ్ కూడా తనకెంతో నచ్చి రాశానని త్రివిక్రమ్ చెప్పాడు.

అలాగే ‘చిరునవ్వుతో’ సినిమాలో ‘వింటూనే ఉన్నాన్రా.. ఊర్లో జనాల సూటిపోటి మాటలు వింటున్నా. మీ అత్తయ్య ఏడ్చే ఏడుపు వింటున్నా. నువ్వు వెళ్లిపోయాక నీ గదిలో నిశ్శబ్దాన్ని వింటున్నా’ అంటూ చంద్రమోహన్ చెప్పే డైలాగ్ రాసినపుడు కూడా తనకు మంచి కిక్ వచ్చిందని త్రివిక్రమ్ తెలిపాడు. ఇలాంటి మాటల విషయంలో దర్శకులు అభ్యంతర పెట్టినా బాగుంటుంది ఉంచండని సర్ది చెప్పి కచ్చితంగా అవి ఉండేలా చూసుకునేవాడినని త్రివిక్రమ్ చెప్పాడు. అలాగే తనకు నచ్చిన డైలాగ్ ఉంటే కొంచెం గట్టిగా చెప్పి దర్శకుడి మనసులో ముద్రించుకుపోయేలా చేసేవాడినని కూడా త్రివిక్రమ్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు