మహానటికి ఎదురు లేదు

మహానటికి ఎదురు లేదు

‘మహానటి’ వచ్చి రెండు వారాలు దాటింది. ఇప్పటికీ ఆ చిత్రమే బాక్సాఫీస్ లీడర్‌గా కొనసాగుతోంది. ‘మహానటి’ వచ్చిన తర్వాతి వారంలో ఏ తెలుగు సినిమా రిలీజవ్వలేదు. అద్భుతమైన టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలి వీకెండ్లో వసూళ్ల వర్షం కురిపించడం.. వీక్ డేస్‌లో కూడా నిలకడగా సాగడంతో కొత్త సినిమాలేవీ రిలీజ్ చేయలేదు.

కేవలం డబ్బింగ్ సినిమాలు ‘కాళి’.. ‘డెడ్ పూల్’ మాత్రమే విడుదలయ్యాయి. వాటికి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఆదరణ దక్కలేదు. ‘మహానటి’ తప్ప ప్రేక్షకులకు ఛాయిస్ లేకపోయింది. మిగతా థియేటర్లన్నీ వెలవెలబోయాయి. ఇక ఈ వారం ఒకటికి రెండు సినిమాలు రిలీజవడంతో పరిస్థితి మారుతుందని అనుకున్నారు. కానీ మార్పేమీ కనిపించడం లేదు.

శుక్రవారం రిలీజైన ‘నేల టిక్కెట్టు’, ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ చిత్రాలకు ముందు నుంచే పెద్దగా బజ్ లేదు. ఉన్నంతలో రవితేజ సినిమా పరిస్థితి నయం. కానీ ఆ చిత్రానికి దారుణమైన టాక్ రావడంతో వసూళ్లు వెంటనే పడిపోయాయి. వీకెండ్లో కూడా సినిమా నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. ఇటు రివ్యూలు.. అటు వర్డ్ ఆఫ్ మౌత్ పూర్తి నెగెటివ్‌గా ఉండటంతో ఏం చేసినా సినిమాను కాపాడే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ‘అమ్మమ్మగారిల్లు’కు మినిమం ఓపెనింగ్స్ లేవు. మార్నింగ్ షో నుంచే థియేటర్లు వెలవెలబోయాయి.
దీనికి కూడా అంత పాజిటివ్ టాకేమీ రాలేదు. కాకపోతే ‘నేల టిక్కెట్టు’ కంటే బెటరంటున్నారంతే. అయినా వసూళ్లేమీ పుంజుకునేలా లేవు. ఇది ‘మహానటి’కి బాగా కలిసొస్తోంది. ఇంకా సినిమా చూడని వాళ్లు.. ఆల్రెడీ చూసిన వాళ్లకు కూడా ఇదే ఫస్ట్ ఛాయిస్ అవుతోంది మూడో వారంలో కూడా.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు