ఏడాదిలో ఎంత పతనమైపోయాడో..

ఏడాదిలో ఎంత పతనమైపోయాడో..

పోయినేడాది ఇదే రోజు ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే సినిమా రిలీజైంది. ఆ చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల అప్పటికే ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినప్పటికీ ఆ సక్సెస్ అతడి ఖాతాలో పడలేదు. నాగార్జునతో పాటు రచయితలు సత్యానంద్, సాయిమాధవ్ బుర్రాల కృషి వల్లే ఆ సినిమా బాగా వచ్చిందన్న అభిప్రాయాలు బలంగా వినిపించాయి.

దీంతో రెండో సినిమాతోనూ తనేంటో రుజువు చేసుకోవాల్సిన అవసరం కళ్యాణ్‌కు పడింది. అతను సవాలును స్వీకరించాడు. ‘రారండోయ్..’తో తనేంటో రుజువు చేసుకున్నాడు. ఆ సినిమా  హిట్టయి కళ్యాణ్‌కు మంచి పేరు తెచ్చింది. నాగచైతన్యకు సోలో హీరోగా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందా చిత్రం.

సరిగ్గా ఆ సినిమా విడుదలైన ఏడాదికి కళ్యాణ్ ఇప్పుడు ‘నేల టిక్కెట్టు’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఫలితమేంటో తొలి ఆటతోనే తేలిపోయింది. ఈ మధ్య కాలంలో ఒక పెద్ద హీరో దేనికీ ఇంత పేలవమైన టాక్ రాలేదు. రవితేజ కెరీర్లోనే అత్యంత చెత్త సినిమాల్లో ఇదొకటిగా పేరు తెచ్చుకుంటోంది. తొలి రెండు సినిమాలతో అలాంటి విజయాలందుకున్న కళ్యాణ్.. ఇలాంటి సినిమా తీస్తాడని ఎవ్వరూ అనుకోలేదు.

ఏడాది కాలంలో అతడి పతనానికి ‘నేల టిక్కెట్టు’ రుజువుగా నిలుస్తోంది. ఈ సినిమా చూశాక ‘రారండోయ్..’ విజయంలోనూ కళ్యాణ్ పాత్రపై సందేహాలు నెలకొనే పరిస్థితి. ‘రారండోయ్..’కి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ రోజు ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ పెట్టి సందడి చేస్తున్నారు అక్కినేని అభిమానులు. కళ్యాణ్ సైతం దాని గురించి స్పందించాడు. కానీ అతడి కొత్త సినిమాకు దారుణమైన టాక్ వచ్చిన నేపథ్యంలో ఆ తీపి గురుతును ఆస్వాదించే పరిస్థితి ఎంతమాత్రం కనిపించడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు