అమెరికాలో మాస్ రాజా పరిస్థితి దయనీయం

అమెరికాలో మాస్ రాజా పరిస్థితి దయనీయం

అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల అభిరుచి భిన్నం. అక్కడ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకే పట్టం కడుతుంటారు. మాస్ మసాలా సినిమాలు వాళ్లకు రుచించవు. ఒక సినిమా ట్రైలర్ చూసే వాళ్లు ఒక అంచనాకు వచ్చేస్తారు.. సినిమాకు వెళ్లాలా వద్దా అని. ఎందుకంటే అక్కడ టికెట్ల రేట్లు ఎక్కువ. దగ్గర్లో థియేటర్లుండవు. కాబట్టి తమ అభిరుచికి తగ్గ సినిమా అయితేనే ఆసక్తి చూపిస్తారు. మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ‘నేల టిక్కెట్టు’ వాళ్ల దృష్టిని ఏమాత్రం ఆకర్షించలేదు. అందుకు ఈ చిత్ర ప్రిమియర్ వసూళ్లే నిదర్శనం.

రవితేజ కెరీర్లోనే అత్యంత పేలవమైన ఓపెనింగ్స్ ‘నేల టిక్కెట్టు’కే వచ్చాయి. ప్రిమియర్ల ద్వారా ఈ చిత్రం 32 వేల డాలర్లు మాత్రమే వసూలు చేస్తుంది. రవితేజ స్థాయి స్టార్ హీరో సినిమాకు ఇలాంటి వసూళ్లు రావడం దారుణం.

రవితేజ చివరి సినిమా ‘టచ్ చేసి చూడు’ ఎంత డిజాస్టర్ అయినప్పటికీ దానికి కూడా ఓ మోస్తరుగానే ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ సినిమా ప్రిమియర్ల ద్వారా 81 వేల డాలర్లు రాబట్టింది. కానీ ‘నేల టిక్కెట్టు’ అందులో సగం కూడా వసూలు చేయలేదు. ఈ చిత్ర టీజర్.. ట్రైలర్ చాలా పేలవంగా కనిపించడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకుల్లోనే ఆసక్తి అంతంతమాత్రంగా కనిపించింది.
కొత్తదనం జాడలే లేకపోవడంతో యుఎస్ ప్రేక్షకులు ఈ సినిమాపై మరింత నిరాసక్తత ప్రదర్శించారు. ఆ ప్రభావం వసూళ్లపై స్పష్టంగా కనిపించింది. యుఎస్ మార్కెట్ కీలకంగా మారిన ఈ రోజుల్లో తాము చేసే సినిమాల విషయంలో హీరోలు తప్పక సమీక్షించుకుని.. క్లాస్ ఎంటర్టైన్మెంట్ కోసం ప్రయత్నించక తప్పని పరిస్థితి నెలకొంది. మరి మాస్ రాజా ఇకపై ఎలాంటి మార్పు చూపిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు