నాగశౌర్య.. పెద్ద సాహసమే

నాగశౌర్య.. పెద్ద సాహసమే

తెలుగు సినిమాలు గే పాత్రలు చాలా చాలా అరుదు. అవంటేనే ప్రేక్షకుల్లో ఒక రకమైన జుగుప్సాకకరమైన ఫీలింగ్ వచ్చేసేది జనాలకు. ఐతే ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో గే పాత్రతోనే ఓ రేంజిలో కామెడీ పండించి మిగతా ఫిలిం మేకర్ల ఆలోచనను మార్చింది ఆ చిత్ర బృందం. అప్పట్నుంచి అడపాదడపా గే టచ్ ఉన్న పాత్రల్ని సినిమాల్లో చూస్తున్నాం.

కానీ హాలీవుడ్.. బాలీవుడ్లలో మాదిరి ఫుల్ లెంగ్త్ గే క్యారెక్టర్లు ఇక్కడ ఇప్పటిదాకా రాలేదు. ఐతే యువ కథానాయకుడు నాగశౌర్య ఈ సాహసమే చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అతను కథానాయకుడిగా ‘నర్తనశాల’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి రూపొందిస్తున్న సినిమా ఇది.

ఈ సినిమాకు ‘నర్తనశాల’ అనే పేరు పెట్టడానికి కారణం మరేంటో కాదు.. ఇందులో నాగశౌర్య గే టచ్ ఉన్న పాత్ర చేస్తుండటమేనట. అతను ఆధునిక బృహన్నలగా కనిపిస్తాడట. ఈ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని.. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని.. వల్గారిటీ లేకుండానే వినోదం పంచే ప్రయత్నం చేయబోతున్నారని అంటున్నారు. గత రెండు మూడేళ్లలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారి కొత్త తరహా ప్రయోగాలెన్నింటికో పట్టం కట్టారు.

ఆ ధైర్యంతోనే శౌర్య అండ్ కో ఈ సాహసం చేస్తున్నారు. ఐతే ప్రేక్షకుల అభిరుచి ఎంత మారినప్పటికీ ఈ తరహా పాత్రను ఏమాత్రం యాక్సెప్ట్ చేస్తారన్న సందేహాలు లేకపోలేదు. ఐతే జనాల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికే చిత్ర బృందం ఈ విషయాన్ని లీక్ చేసి చూసింది. మరి వాళ్లకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు