మహానటి లాభమెంత?

మహానటి లాభమెంత?

సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ చివరగా ఎప్పుడు నిఖార్సయిన హిట్టు కొట్టారో కూడా జనాలకు గుర్తు లేదు. ఎప్పుడో దశాబ్దంన్నర కిందట వచ్చిన ‘ఇంద్ర’ ఆయనకు భారీ విజయాన్నందించింది. అప్పటి నుంచి ఆయనకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలాయో లెక్కలేదు. మధ్యలో ‘చిరుత’ ఒక్కటి నష్టాల్లేకుండా బయటపడింది.

మిగతా సినిమాలన్నీ దత్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. ‘శక్తి’.. ‘కంత్రి’.. ‘కథానాయకుడు’ లాంటి సినిమాలైతే దత్ ను నిండా ముంచేశాయి. దెబ్బకు సినిమాల నుంచి ఆయన పక్కకు తప్పుకుని కూతుళ్లకు బాధ్యతలు అప్పగించే పరిస్థితి వచ్చింది. వాళ్లు సైతం ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. ఐతే ఇప్పుడు తండ్రీ కూతుళ్లు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా.. నిజాయితీగా తీసిన ‘మహానటి’ వాళ్ల కరవు తీర్చింది. వాళ్ల కష్టానికి తగ్గ గొప్ప ఫలితాన్నందించింది.

‘మహానటి’ గొప్ప సినిమాగా పేరు తెచ్చుకోవడమే కాదు.. కమర్షియల్ గానూ ఘనవిజయాన్నే అందుకుంది. పెట్టుబడి మీద రెట్టింపు ఆదాయాన్ని ఈ చిత్రం తెచ్చి పెట్టేలా ఉంది. ఈ చిత్రంపై రూ.25-30 కోట్ల మధ్య పెట్టుబడి పెట్టిందట దత్ కుటుంబం. ఐతే అందుకు తగ్గట్లుగా బిజినెస్ జరగలేదు. చాలాచోట్ల సొంతంగా రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. కొన్ని ఏరియాల్లో నామమాత్రపు రేటుకు సినిమాను అమ్మారు. ఇప్పుడు చూస్తే ఈ చిత్రం పెద్ద సినిమాల స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే షేర్ రూ.35 కోట్లు దాటింది. ఇంకో పది కోట్ల దాకా షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు ఈ చిత్ర శాటిలైట్ డీల్ ఇంకా తెగలేదు. రెండు భాషలకూ కలిపి రూ.10 కోట్ల పైనా రావచ్చు. ఇంకా డిజిటల్.. డబ్బింగ్ హక్కులు కూడా ఉన్నాయి. అన్నీ కలుపుకుంటే మొత్తంగా రూ.60 కోట్ల దాకా ‘మహానటి’ ఆదాయం తెచ్చి పెడుతుందని భావిస్తున్నారు. ఇలాంటి సినిమాకు పెట్టుబడి మీద రెట్టింపు ఆదాయమంటే మామూలు విషయం కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు