‘సంజు’ కోసం అమీర్‌ను అడిగారట

‘సంజు’ కోసం అమీర్‌ను అడిగారట

సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘సంజు’. దత్ మిత్రుడు రాజ్ కుమార్ హిరాని ఈ చిత్రాన్ని రూపొందించాడు. ‘మున్నాభాయ్’ సిరీస్‌లోని రెండు సినిమాలు.. ఇంకా ‘3 ఇడియట్స్’.. ‘పీకే’ లాంటి ల్యాండ్ మార్క్‌ ఫిలిమ్స్‌తో హిరాని దర్శకుడిగా ఎలాంటి పేరు సంపాదించాడో తెలిసిందే. ‘సంజు’ సినిమా విషయంలో జనాలకు ముందు రకరకాల సందేహాలు నెలకొన్నాయి కానీ.. ఈ చిత్ర టీజర్ చూశాక అవన్నీ పటాపంచలయ్యాయి.

హిరాని నుంచి మరో అద్భుతం చూడబోతున్న భావన కలిగింది. నిజానికి ఈ చిత్రం కోసం మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్‌ను కూడా అడిగాడట హిరాని. ఐతే అతడికి ఆఫర్ చేసింది సంజయ్ దత్ క్యారెక్టర్ కాదు. అతడి తండ్రి సునీల్ దత్ పాత్ర అట. హిరానితో ఉన్న స్నేహం దృష్యా ఈ పాత్ర విషయంలో కొంచెం ఆలోచించాడట అమీర్.

కానీ ‘సంజు’లో లీడ్ రోల్ చేయబోతోంది రణబీర్ కపూర్ అన్నాక వెనక్కి తగ్గాడట అమీర్. రణబీర్ తండ్రిగా తాను సూటవ్వనని.. కాబట్టి ఈ పాత్ర చేయడంలో తనకు అభ్యంతరాలున్నాయని వెనక్కి తగ్గానని అమీర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఐతే హిరాని ఈ సినిమా గురించి.. తన పాత్ర గురించి భలేగా చెప్పాడని.. ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుందని అమీర్ తెలిపాడు. తాను అన్ని రకాల పాత్రలూ చేయగలనని అనుకోనని.. ఆచితూచి పాత్రలు ఎంచుకుంటానని అమీర్ చెప్పాడు.

తన కెరీర్లో ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ చాలా ప్రత్యేకమైన సినిమా అని.. ఆ చిత్రమే తన కెరీర్‌ను మలుపు తిప్పిందని.. కానీ ఆ చిత్రం తనకెంత మంచి పేరు తెచ్చిపెట్టినప్పటికీ ఆర్థికంగా మాత్రం ఎలాంటి ప్రయోజనం తెచ్చి పెట్టలేదని.. ఆ సినిమాకు పారితోషకం కింద కేవలం రూ.11 వేలు మాత్రమే అందుకున్నానని అమీర్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు