రాజ్ తరుణ్‌కు గండి కొట్టేశారుగా..

రాజ్ తరుణ్‌కు గండి కొట్టేశారుగా..

పాపం రాజ్ తరుణ్.. కెరీర్ ఆరంభంలో వరుసగా మూడు హిట్లు కొట్టి మాంచి ఊపుమీద కనిపించిన ఈ కుర్రాడు, ఆ తర్వాత గాడి తప్పాడు. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయాడు. మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుదామని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఫలించడం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి ‘రంగులరాట్నం’ అనే సినిమాతో పలకరించాడతను. అది దారుణ ఫలితాన్ని అందుకుంది.
ఇప్పుడతడి ఆశలన్నీ ‘రాజు గాడు’ మీదే ఉన్నాయి. ఈ చిత్రం కొన్ని నెలల కిందటే విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చుకున్న ఈ చిత్రాన్ని జూన్ 1న ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలనుకున్నారు. ఏ పోటీ ఉండదనుకుని ఆ తేదీని ఎంచుకున్నాడు నిర్మాత అనిల్ సుంకర. కానీ ఆ సినిమాకు తీవ్రమైన పోటీ తప్పేలా లేదు.

ఈ శుక్రవారమే రావాల్సిన ‘ఆఫీసర్’.. ‘నా నువ్వే’ సినిమాల్ని అనుకోకుండా జూన్ 1కి వాయిదా వేసేశారు. మరోవైపు తమిళంలో సూపర్ హిట్టయిన ‘ఇరుంబు తురై’ని ‘అభిమన్యుడు’ పేరుతో జూన్ 1నే విడుదల చేయబోతున్నారు. ఒకటికి మూడు సినిమాలొచ్చి జూన్ 1 మీద పడటంతో ‘రాజుగాడు’కు మళ్లీ నిరాశ తప్పట్లేదు. వీటితో పోటీపడే శక్తి లేక ఆ చిత్రాన్ని మళ్లీ వాయిదా వేసేస్తున్నట్లు సమాచారం. నాగార్జున సినిమా ‘ఆఫీసర్’ విషయంలో కొంచెం సందేహాలున్నాయి. అది జూన్ 1న రాకపోవచ్చంటున్నారు.

అదే నిజమైతే ‘రాజుగాడు’ను ఆ తేదీకి విడుదల చేసేస్తారు. లేదంటే మాత్రం వాయిదా తప్పదు. మళ్లీ రెండు మూడు వారాల వరకు ఈ చిత్రానికి ఖాళీ దొరికే అవకాశాలు లేవు. ప్రతిసారీ ఒక డేట్ ఎంచుకోవడం.. ఆ తేదీకి పోటీ పెరిగిపోయి వాయిదా వేసుకోవడం.. ఇలా సాగుతున్న ‘రాజుగాడు’ వ్యవహారం ఎప్పటికి తేలుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు