నాగ్‌ను కంటే బాలయ్యను మెప్పించడమే ఈజీ

నాగ్‌ను కంటే బాలయ్యను మెప్పించడమే ఈజీ

పూరి జగన్నాథ్ వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి ఉత్తమ చిత్రంలో నటించిన బాలయ్య అతడికి అవకాశమిచ్చాడు. ఇది అందరికీ పెద్ద షాకే. ఇలాంటి టైంలో బాలయ్య ఇచ్చిన అవకాశాన్ని పూరి సద్వినియోగం చేసుకుని ఒక ప్రత్యేకమైన సినిమాను అందిస్తాడని అనుకున్నారంతా. కానీ ఎప్పట్లాగే మరో మాఫియా కథను తిరగరాసి ‘పైసా వసూల్’ అనే పేలవమైన సినిమా తీశాడు పూరి.

ఆయనకు అవకాశమివ్వడమే తప్పంటూ బాలయ్య అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ‘పైసా వసూల్’ ఫ్లాపయ్యాక కూడా బాలయ్య పూరితో ఇంకో సినిమా చేస్తాడని అప్పట్లో వార్తలొస్తే వాళ్ల ఆగ్రహం మామూలుగా లేదు. కానీ ఆ వార్తలు నిజం కాలేదు. పూరి తన తర్వాతి సినిమాను కొడుకు ఆకాశ్‌తో చేశాడు. అదే.. మెహబూబా. దాని ఫలితమేంటో తెలిసిందే.

‘మెహబూబా’ తర్వాత పూరితో జట్టు కట్టడానికి మీడియం రేంజి హీరోలు కూడా భయపడిపోతున్న పరిస్థితి. అలాగని కొడుకు ఆకాశ్‌తో ఇంకో సినిమా చేస్తే అతడి కెరీర్ ప్రమాదంలో పడిపోతుంది. ఈ పరిస్థితుల్లో బయటి హీరోతోనే సినిమా చేయాలనుకుంటున్నాడట పూరి. ఇందుకోసం మళ్లీ బాలయ్యనే దువ్వుతున్నాడని ప్రచారం జరుగుతోంది. నాగార్జున-నాగచైతన్య కాంబినేషన్లో మల్టీస్టారర్ ఒకటి అనున్నాడు కానీ.. ‘మెహబూబా’ రిజల్ట్ చూశాక నాగ్ వెనక్కి తగ్గాడంటున్నారు.

నాగ్‌ను ఒప్పించడం కంటే బాలయ్యను మెప్పించడమే ఈజీ అని పూరి ఫిక్సయ్యాడని.. బాలయ్య సానుకూలంగానే స్పందిస్తున్నాడని.. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చే ఏడాది సినిమా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. మరి ‘పైసా వసూల్’ రిజల్ట్ చూశాక కూడా బాలయ్య పూరిని నమ్ముతున్నాడంటే ఆశ్చర్యపోవాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు