సావిత్రి చనిపోయాక ఏం జరిగిందంటే..

సావిత్రి చనిపోయాక ఏం జరిగిందంటే..

మహానటి సావిత్రి జీవితంలో అనేక విషయాలపై ఎప్పట్నుంచో జనాలకు సందేహాలున్నాయి. ఆ సందేహాలకు చాలా వరకు సమాధానాలు ఇచ్చింది ‘మహానటి’ సినిమా. అయినప్పటికీ ఇంకా కొన్ని అనుమానాలు తీరలేదు. సావిత్రి చనిపోయాక అసలేం జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. సినిమాలో కూడా ఆ విషయాలేమీ చూపించలేదు. సావిత్రి మరణానంతరం ఆమె పార్థివ దేహాన్ని జెమిని గణేశన్ ఇంట్లోకి రానివ్వలేదని.. అలాగే ఆమె ఆస్తుల విషయంలో జెమిని గణేశన్ మోసం చేశాడని రకరకాల ఊహాగానాలున్నాయి. ఈ విషయమై జెమిని గణేశన్ పెద్ద భార్య కూతురు కమల సెల్వరాజ్ స్పందించింది. సావిత్రి మరణానంతరం అసలేం జరిగిందో వివరించే ప్రయత్నం చేసింది.

సావిత్రి మృతదేహాన్ని తమ ఇంటికే తీసుకొచ్చినట్లు ఆమె వెల్లడించింది. తమది చాలా పెద్ద ఇల్లని.. ఇంటిముందే ఆమె పార్థివ దేహాన్ని ఉంచి అన్ని కార్యక్రమాలూ సంప్రదాయబద్ధంగా నిర్వహించామని ఆమె తెలిపింది. ఆమె కడసారి చూపు కోసం అభిమానులకు కూడా అవకాశమిచ్చామని.. వాళ్లు ఇంటి ముందు నుంచి పెద్ద ఎత్తున క్యూలో నిలబడి వచ్చి ఆమెను కడసారి చూశారని చెప్పారు. సావిత్రి ఎలా అయిపోయిందో చూడండి అంటూ తన తండ్రి తమ అందరికీ చూపిస్తూ ఏడ్చారని ఆమె అన్నారు. సావిత్రితో తన తల్లి చాలా సఖ్యతతో ఉండేదని.. ఆమెను బాగా చూసుకుందని కమల చెప్పారు.

ఇక సావిత్రి ఆస్తుల విషయంలో జరిగిన ప్రచారమంతా అబద్ధమని.. ఆమె ఆస్తుల్ని వేరే వాళ్లు కాజేసే ప్రయత్నం చేస్తే.. వాటి మీద పోరాడి.. ఎన్నోరోజులు కోర్టుకు కూడా వెళ్లి వాటిని సాధించారని.. సావిత్రి కొడుకుకి.. కూతురికి వాటిని అందజేశారని ఆమె అన్నారు. సావిత్రి ఆర్థికంగా కష్టాల్లో ఉన్నపుడు సాయం చేయడానికి వెళ్తే.. తన తండ్రిని రానివ్వలేదని.. కాబట్టే ఆయన ఏమీ చేయలేకపోయారని ఆమె స్పష్టం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు