రెండేళ్లకే స్టార్.. పట్టించుకునేవాళ్లు లేరిప్పుడు

రెండేళ్లకే స్టార్.. పట్టించుకునేవాళ్లు లేరిప్పుడు

రెండేళ్ల వయసుకే సూపర్ స్టార్ అయిపోయింది బేబీ షామిలి. ‘అంజలి’.. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ లాంటి సినిమాలతో ఆ పాపకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. అంత చిన్న వయసులో మరే చైల్డ్ ఆర్టిస్టుకూ అంత పేరు ప్రఖ్యాతులు లభించి ఉండవు. అప్పట్లో షామిలి డేట్ల కోసం దర్శక నిర్మాతలు ఎగబడే పరిస్థితి ఉండేది. ఆమెకు మంచి పారితోషకం ఇచ్చి తమ సినిమాలకు తీసుకునేవాళ్లు ఫిలిం మేకర్స్. చిన్నతనంలోనే అలాంటి స్టార్ స్టేటస్ సంపాదించిన షామిలి.. పెద్దయ్యాక మాత్రం తన ముద్ర వేయలేకపోయింది. తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా ‘ఓయ్’ అట్టర్ ఫ్లాప్ అయింది. అందులో షామిలి మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు కానీ.. ఆమె కూడా పేలవంగా కనిపించి నిరాశ పరిచింది. దీంతో మళ్లీ తెలుగులో ఇంకో అవకాశం దక్కలేదు.

తమిళంలో ఏదో ఒక సినిమా చేసింది కానీ అదీ ఆడలేదు. అక్కడా కెరీర్ ముందుకు సాగలేదు. ఎట్టకేలకు తెలుగులో మళ్లీ నాగశౌర్య సరసన ‘అమ్మమ్మగారిల్లు’ చేసే అవకాశం వచ్చింది కానీ.. ఇది కూడా ఆమెకు నిరాశనే మిగిల్చేలా కనిపిస్తోంది. ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తిని రేకెత్తించలేదు. ఇక షామిలి గురించైతే చెప్పనవసరం లేదు. టీజర్.. ట్రైలర్లలో ఆమె లుక్స్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ సినిమాకు హీరోయిన్ వల్ల ఏమాత్రం ఆకర్షణ తోడవలేదు. సినిమాలో కూడా షామిలి ఏమైనా ప్రత్యేకమైన ముద్ర వేస్తుందేమో అన్న అంచనాలు లేవు. అసలు ఈ సినిమా మీదే అంచనాలు లేవు. రిలీజ్ తర్వాత అద్భుతాలేమైనా జరిగిపోయి షామిలికి పేరొస్తుందేమో.. తర్వాత ఆమెకు తెలుగులో ఇంకో సినిమాలో కథానాయికగా అవకాశం వస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు