మెగా ఫాన్స్‌ని ఆకట్టుకునే తిప్పలు

మెగా ఫాన్స్‌ని ఆకట్టుకునే తిప్పలు

చిరంజీవి ఇంటి నుంచి క్రికెట్‌ టీమ్‌కి సరిపడా హీరోలు దిగిపోయారనే సరదా కామెంట్ల సంగతి తెలిసిందే. ఎంతమంది వచ్చినా కానీ నెత్తిన పెట్టుకుంటున్నారంటూ మెగా అభిమానులని ట్రోల్‌ కూడా చేస్తుంటారు. అందుకేనేమో అల్లు అర్జున్‌ తమ్ముడు అల్లు శిరీష్‌ని మెగా ఫాన్స్‌ పట్టించుకోలేదు. ఇంతలో చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా మారాడు.

అసలు సినీ నేపథ్యమే లేని కళ్యాణ్‌ దేవ్‌ని హీరోగా చేయడం పట్ల అభిమానులే విసుక్కుంటున్నారు. ఇంట్లోకి కొత్తగా ఎవరు వచ్చినా తమ మీద రుద్దేస్తారా అనే భావన చాలా మందిలో నెలకొంది. అయితే చూడ్డానికి బాగుంటాడు కనుక చిరంజీవి అల్లుడి హోదాలో పాస్‌ అయిపోతాడని అతడిని వారాహి సంస్థ పరిచయం చేస్తోంది. అతని తొలి చిత్రంపై ఎలాంటి క్రేజ్‌ లేకపోయినా కానీ అభిమానులని ఆకట్టుకునే ప్రయత్నాలయితే ముమ్మరంగా జరుగుతున్నాయి.

సినిమాకి టైటిల్‌ కూడా చిరంజీవి పాత సినిమా విజేత పేరు పెట్టడం అభిమానులని పడేసే ప్రయత్నంలో భాగమేనని అర్థమవుతోంది. చిరంజీవి ఫాన్‌ క్లబ్స్‌ ప్రెసిడెంట్స్‌ని, చిరంజీవికి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అభిమానులని కాంటాక్ట్‌ చేసి వారి నుంచి పూర్తి సహకారం తీసుకోవాలని చూస్తున్నారట. అయితే ఇప్పటికే చాలా మంది హీరోలైపోయారు కనుక నిజంగా కళ్యాణ్‌ దేవ్‌లో టాలెంట్‌ వుండి, ఒక రెండు మూడు సినిమాలు సొంతంగా హిట్లు కొడితే తప్ప ఫాన్స్‌ అతడిని ఓన్‌ చేసుకోవడం కాస్త కష్టమేననిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు