70% మారిస్తే అసలు ఏముంటుంది రాజా?

70% మారిస్తే అసలు ఏముంటుంది రాజా?

మైత్రీ మూవీస్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమా కోసం అంతా సెట్ అయింది. కానీ ఈలోగా పవన్ సినిమాలకు బైబై చెప్పేయడంతో.. ఈ ప్రాజెక్టు మాస్ రాజా రవితేజ చెంతకు చేరింది. అయితే.. ఇది తమిళ్ లో విజయ్ నటించిన తెరి మూవీకి రీమేక్ అనే ప్రచారం ముందు నుంచీ ఉంది. ఇప్పుడు మాస్ మహరాజ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు.

'తెరి రీమేక్ లో నేను నటిస్తున్నాను. కానీ ఆ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్లుగా చాలానే మార్పులు చేశాం. సినిమాలో దాదాపు 70శాతం మార్చేయడం జరిగింది. ఇప్పుడిది పూర్తిగా కొత్త సినిమా అనిపించేల ఉంటుంది. నా క్యారెక్టర్ కు కూడా పలు కొత్త వేరియేషన్స్ ఉంటాయి' అంటున్నాడు రవితేజ. మొత్తం మీద 'తెరి' సినిమాను బోలెడంత మార్చాం అంటున్నాడు మాస్ రాజా. అసలు ఆ రేంజులో మారిస్తే సినిమాలో ఏముంటుంది? మనోళ్లకు నచ్చుతుందా? అన్నదే ఆలోచించాల్సిన విషయం. థీమ్ బేస్డ్ కమర్షియల్ మూవీలో ఎలాంటి మార్పులు చేశారన్నదే ఆసక్తి కలిగించే విషయం.

ఈ మధ్య కాలంలో ఇలా విపరీతంగా మార్చేసి తీసిన తమిళ హిట్టు సినిమాలలో చాలావరకు ఫ్లాప్ అయ్యాయి. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 మినహా.. మిగిలిన చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. ఒరిజినల్ ను యథాతథంగా తీసినవే కాసింత అటూ ఇటూగా ఆడాయి. మరిప్పుడు తెరి రీమేక్ ను పవన్ కోసం వీలుగా ఓసారి మార్చారు. ఆ తర్వాత రవితేజకు అనుగుణంగా స్క్రిప్టులో ఛేంజెస్ చేశాడు దర్శకుడు సంతోష్. మరి ఇన్ని మార్పుల తర్వాత.. ఈ తెలుగు తెరి ఎలా ఉంటుందో చూడాలి!!