ఎన్టీఆర్‌ బయోపిక్‌.. ప్రాణం లేచొచ్చింది

ఎన్టీఆర్‌ బయోపిక్‌.. ప్రాణం లేచొచ్చింది

రెండు నెలల కిందట అంగరంగ వైభవంగా ఎన్టీఆర్‌ బయోపిక్‌కు శ్రీకారం చుట్టాడు నందమూరి బాలకృష్ణ. కానీ ఆయన ప్రయత్నానికి ఆరంభంలోనే బ్రేక్ పడిపోయింది. దర్శకుడు తేజ ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో ఆ ప్రాజెక్టు డైలమాలో పడిపోయింది. తేజ స్థానంలోకి వచ్చే దర్శకుడంటూ మధ్యలో రకరకాల పేర్లు వినిపించాయి. ఒక దశలో బాలయ్యే స్వయంగా డైరెక్ట్ చేస్తాడన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. అది తెలిసి చాలామంది నిరాశ చెందారు. బాలయ్య ఈ చిత్రాన్ని ఏమాత్రం డీల్ చేయగలడా అని సందేహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు మీద నెమ్మదిగా ఆసక్తి సన్నగిల్లిపోయింది. ఐతే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్‌లోకి క్రిష్ వస్తున్నాడట. ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు కానీ.. ఇన్నాళ్లూ దీని గురించి చర్చలు కూడా జరపని క్రిష్.. త్వరలోనే సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి బాలయ్యను కలవబోతున్నాడట.

ఇప్పటిదాకా జరిగిన బ్యాగ్రౌండ్ వర్క్, స్క్రిప్టు పనుల్ని క్రిష్ పరిశీలించబోతున్నట్లు సమాచారం. అన్నీ చూశాక తాను ఈ సినిమా చేయగలిగేదీ లేనిదీ చెప్పేస్తాడట. క్రిష్ ఈ మాత్రం సుముఖత వ్యక్తం చేశాడంటే కచ్చితంగా ఈ సినిమా చేసే అవకాశముందని.. క్రిష్ మీద ఉన్న గౌరవంతో బాలయ్య కూడా ఈ సినిమా ఎలా తీయాలనే విషయంలో పట్టుదలకు పోక పోవచ్చని అంటున్నారు.

సావిత్రి కథతో తెరకెక్కిన ‘మహానటి’ క్లాసిక్ అన్న పేరు తెచ్చుకున్న నేపథ్యంలో ‘యన్.టి.ఆర్’ను ఆషామాషీగా తీస్తే కష్టమని బాలయ్య కూడా ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. అందుకే క్రిష్ లాంటి మేటి దర్శకుడి చేతిలో పెట్టి.. కొంచెం స్వేచ్ఛ ఇస్తే సినిమా బాగా వస్తుందని.. ఇది చరిత్రలో నిలిచిపోతుందని బాలయ్య భావిస్తున్నాడట. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు