శంకర్‌కు షాకిచ్చిన నెటిజన్లు

శంకర్‌కు షాకిచ్చిన నెటిజన్లు

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఎప్పుడూ వివాదాస్పద అంశాల జోలికి వెళ్లడు. కానీ ఆయన తాజాగా చేసిన ఒక ట్వీట్ వివాదాస్పదమైంది. ఆయన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. నెటిజన్లతో తిట్లు తినేలా చేసింది.

ఇంతకీ ఆయన చేసిన ట్వీట్లో ఏముందో తెలుసా? ఐపీఎల్ తొలి క్వాలిఫయర్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మీద థ్రిల్లింగ్ విక్టరీతో ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు శుభాకాంక్షలు అని. ఇందులో వివాదం చేయడానికి.. అభ్యంతర పెట్టడానికి ఏముంది అంటారా?

ఆ ట్వీట్ తప్పు కానీ.. అది చేసిన టైమింగ్ కరెక్ట్ కాదు. నిన్న తమిళనాడులోని తూత్తుకుడిలో చెడు రసాయనాలు విడుదల చేస్తూ ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న ఒక ఫ్యాక్టరీని మూత వేయాలంటూ ఆందోళన చేసిన జనాలపై పోలీసులు తుపాకులు ప్రయోగించడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ ఘటన నేపథ్యంలో తమిళ జనాలందరూ విషాదంలో మునిగిపోయి ఉండగా.. ఐపీఎల్ మ్యాచ్ గురించి ట్వీట్ చేస్తావా అంటూ నెటిజన్లు శంకర్‌ను తగులుకున్నారు. జనం సమస్యల కంటే ఐపీఎలే ముఖ్యమా అంటూ ఆయన్ని తీవ్రంగా విమర్శించారు.

దీంతో శంకర్ కాసేపటికే తన ట్వీట్‌ను డెలీట్ చేయాల్సి వచ్చింది. ఉదయం తూత్తుకుడి ఘటన మీద విచారం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేసి తప్పు దిద్దుకునే ప్రయత్నం చేశాడు శంకర్. అయినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. తమిళనాట ఎంత పెద్ద సెలబ్రెటీ అయినా సరే.. జనం సమస్యల విషయంలో స్పందించకపోతే జనాల ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది.

అందుకే జల్లికట్టు.. కావేరీ లాంటి ఇష్యూలు వచ్చినపుడు అక్కడి సినీ ప్రముఖులంతా పనులు పక్కన పెట్టి ఆందోళన బాట పట్టారు. ఈ పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కనిపించదు. మన సెలబ్రెటీలకు జనం సమస్యలు అసలేమాత్రం పట్టవు. ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా ఒక ట్వీట్ చేయడానికి కూడా మనోళ్లు బద్దకమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు