వర్మ.. ది డిస్ట్రిబ్యూటర్

వర్మ.. ది డిస్ట్రిబ్యూటర్

రామ్ గోపాల్ వర్మను ఇప్పటిదాకా చాలా అవతారాల్లో చూశాం. ఇప్పుడు మరో కొత్త అవతారంలో చూడబోతున్నాం. ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా కనిపించబోతున్నాడట. తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘ఆఫీసర్’ సినిమాను నైజాం ఏరియాకు సొంతంగా రిలీజ్ చేయబోతున్నాడట వర్మ. ఈ నెల 25నే రావాల్సిన ‘ఆఫీసర్’ జూన్ 1కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఐతే ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో మాత్రం వర్మ సొంతంగా రిలీజ్ చేస్తున్నాడట. ఐతే సినిమా మీద భరోసాతో ఆ ఏరియా వరకు వర్మ హక్కుల్ని ఉంచుకున్నాడనుకుంటే పొరబాటే. ఆ ఏరియాకు బిజినెస్ జరక్కపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. మిగతా ఏరియాల నుంచి కూడా బయ్యర్ల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదట. ఐతే కొంచెం రాజీపడి సినిమాను ఇచ్చేసినట్లు సమాచారం.

నైజాంలో మాత్రం బయ్యర్లెవరూ ముందుకు రాకపోవడంతో తన కంపెనీ ప్రొడక్షన్స్ మీదుగా సినిమాను వర్మే సొంతంగా రిలీజ్ చేయడానికి ఫిక్సయ్యాడట. కాకపోతే ‘ఆఫీసర్’ మీద వర్మ మరీ ఎక్కువ పెట్టుబడేమీ పెట్టలేదంటున్నారు. పరిమిత బడ్జెట్లోనే సినిమాను లాగించేశాడట. వర్మతో ఈ టైంలో నాగార్జున సినిమా చేయడమే ఎక్కువ. అందుకే ఆయన ప్రొడక్షన్ విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. ఏ నిర్మాతనూ తీసుకురాలేదు. ప్రొడక్షన్ బాధ్యతలన్నీ వర్మే చూసుకున్నాడు. కాకపోతే నాగ్ మామూలుగా బయటి బేనర్ల నుంచి తీసుకునేదాంతో పోలిస్తే కొంచెం తక్కువ పారితోషకానికే ఈ సినిమా చేసినట్లు సమాచారం.
మరి వర్మ పెట్టుబడిని ‘ఆఫీసర్’ ఏమేరకు వెనక్కి తెస్తుందో.. సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. క్రిమినల్ ఆలోచనలతో వ్యవస్థకు సవాలుగా మారిన ఒక మాజీ పోలీసాఫీసర్ పని పట్టే సిట్ ఆఫీసర్ పాత్రలో నాగ్ కనిపించనున్నాడీ చిత్రంలో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు