70 శాతం మార్చేశామంటున్న మాస్ రాజా

70 శాతం మార్చేశామంటున్న మాస్ రాజా

మాస్ రాజా రవితేజ చాన్నాళ్ల తర్వాత ఒక రీమేక్ సినిమా చేయబోతున్నాడు. తమిళంలో విజయవంతమైన ‘తెరి’ చిత్రం రీమేక్‌‌లో మాస్ రాజా నటించనున్నాడు. ఈ విషయంలో ఇంకా ఏవైనా సందేహాలుంటే వాటికి రవితేజానే స్వయంగా తెరదించాడు. తన కొత్త సినిమా ‘నేల టిక్కెట్టు’ ప్రమోషన్లలో భాగంగా ‘తెరి’ రీమేక్ గురించి మాస్ రాజా స్పందించాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాను చేయబోయే సినిమా ‘తెరి’ ఆధారంగానే తెరకెక్కనుందని చెప్పాడు.

ఐతే ‘తెరి’ కథ పాతదేమీ కాదు. అది ‘బాషా’ ఫార్మాట్లో వచ్చిన చాలా సినిమాల్ని పోలి ఉంటంది. పైగా ఆల్రెడీ తెలుగులో ‘పోలీస్’ పేరుతోనూ ఆ చిత్రం డబ్బింగ్ వెర్షన్ రిలీజైంది. అలాంటపుడు ‘తెరి’ తెలుగు రీమేక్ చేయడం సరైన నిర్ణయమేనా అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఇదే విషయం మాస్ రాజా దగ్గర ప్రస్తావిస్తే.. ‘‘తెరిని ఉన్నదున్నట్లు తీయడం లేదు. 70 శాతం మార్పులు చేస్తున్నాం. లైన్ తీసుకుని కొత్త ట్రీట్మెంట్‌తో సినిమా చూపించబోతున్నాం’’ అన్నాడు.

ఇక రీమేక్ సినిమాలు చేయడంలో మీ అభిప్రాయమేంటి.. కొందరు హీరోలు రీమేక్‌ల జోలికి వెళ్లం అంటారు కదా అని మాస్ రాజా దగ్గర ప్రస్తావిస్తే.. ‘‘ఇవి చేయను అవి చేయను అంటూ నేను స్టేట్మెంట్లు ఇవ్వను. నా మనసుకు నచ్చింది.. నేను కనెక్టయింది చేస్తూ పోవడమే’’ అన్నాడు. ఇక ఈ వారం విడుదలయ్యే ‘నేల టిక్కెట్టు’ గురించి స్పందిస్తూ అది కొత్త కథేమీ కాదని.. కానీ స్క్రీన్ ప్లే.. ఇందులోని వినోదం నచ్చి సినిమా చేసినట్లు చెప్పాడు మాస్ రాజా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు