ప్రభాస్ ఎందుకంత రిస్క్ చేస్తున్నాడు?

ప్రభాస్ ఎందుకంత రిస్క్ చేస్తున్నాడు?

‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు ఉత్తరాది వాళ్లు సైతం అతడిని ఒక స్టార్ లాగే చూస్తారు. మన వాళ్ల లాగే ‘సాహో’ కోసం వాళ్లు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ అంచనాలకు తగ్గట్లే ఆ చిత్రాన్ని చాలా శ్రద్ధగా తీర్చిదిద్దుతోంది చిత్ర బృందం. హాలీవుడ్ రేంజికి ఏమాత్రం తగ్గని భారీతనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

తెలుగుతో పాటు ఒకేసారి హిందీ.. తమిళం.. మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. హిందీ ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమాలా అనిపించకుండా డైరెక్ట్ మూవీ అనిపించే భావన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు తర్వాత ‘సాహో’ టీం టార్గెట్ చేసిన మార్కెట్ అదే. ఇందుకోసమే శ్రద్ధాకపూర్, నీల్ నితిన్ ముకేశ్, జాకీష్రాఫ్ లాంటి నటీనటుల్ని.. శంకర్-ఎహసాన్-లాయ్ లాంటి సంగీత దర్శకుల్ని ఈ చిత్రం కోసం తీసుకున్నారు.

ఇంకో విశేషం ఏంటంటే.. ‘సాహో’ సినిమాకు ప్రభాస్ హిందీలోనూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడు. ఇందుకోసం అతను హిందీలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. తనకు హిందీ మాట్లాడటం, రాయడం వచ్చినప్పటికీ లోకల్ వాళ్లలా ఆ భాష మాట్టాడేందుకు కష్టపడుతున్నానని ప్రభాస్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తన కోస్టార్స్ అయిన శ్రద్ధ, నీల్, జాకీల సహకారం తీసుకుంటున్నట్లు అతను చెప్పాడు. ఐతే మామూలుగా ప్రభాస్‌ తెలుగు డబ్బింగే సరిగా చెప్పలేడన్న విమర్శలున్నాయి.

ప్రభాస్‌లో అన్ని ఆకర్షణలూ ఉన్నా.. వాయిస్ మైనస్సే. డైలాగులు పట్టి పట్టి చెప్పడం ఇబ్బందిగా అనిపిస్తుంది. తెలుగులోనే అలా ఇబ్బంది పడుతుంటే ఇక హిందీ సంగతెలా ఉంటుందో అన్న సందేహాలున్నాయి. ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో విలన్ పాత్ర చేసిన శరద్  ఖేల్కర్ ‘బాహుబలి’లో ప్రభాస్‌కు గొంతు అరువిచ్చాడు. ఆల్రెడీ ఆ వాయిస్‌కు అలవాటు పడ్డారు కాబట్టి అతడినే కంటిన్యూ చేయకుండా ప్రభాస్ సొంత వాయిస్ వినిపించే సాహసం ఎందుకు చేస్తున్నట్లో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు