రిలీజ్ డేట్ల గందరగోళం

రిలీజ్ డేట్ల గందరగోళం

మే నెలకు అనుకున్న సినిమాలు వేరు. వస్తున్న సినిమాలు వేరు. ఈ నెలలో రావాల్సిన ఐదారు సినిమాలు వాయిదా పడిపోయాయి. అందులో ‘సాక్ష్యం’.. ‘పంతం’.. ‘ట్యాక్సీవాలా’.. ‘ఆఫీసర్’.. ‘నా నువ్వే’ లాంటి సినిమాలున్నాయి. వీటిలో ‘సాక్ష్యం’.. ‘పంతం’ సినిమాలు చాలా ముందే వాయిదా పడ్డాయి. మిగతా చిత్రాలన్నీ విడుదలకు పది రోజుల ముందు ఉన్నట్లుండి షాకిచ్చాయి. ఈ నెల 18న రావాల్సిన ట్యాక్సీవాలాను జూన్‌కు వాయిదా వేశారు.

తాజాగా వస్తున్న సమచారం ప్రకారం ఈ చిత్రం జూన్ 14న రిలీజవుతుందట. ఇక 25వ తేదీకి షెడ్యూల్ అయిన ‘ఆఫీసర్’, ‘నా నువ్వే’ సినిమాలు ఒకదాని తర్వాత వాయిదా ప్రకటనలు ఇచ్చాయి. ఈ రెండు చిత్రాల్ని జూన్ 1కి వాయిదా వేసినట్లు చెబుతున్నారు. కానీ పక్కాగా ఆ తేదీకి ఇవి రిలీజవుతాయా అన్నది సందేహంగానే ఉంది.

‘ఆఫీసర్’.. ‘నా నువ్వే’ చిత్రాలు వాయిదా పడటంతో సడెన్‌గా నాగశౌర్య సినిమా ‘అమ్మమ్మగారిల్లు’ను ‘నేల టిక్కెట్టు’కు పోటీగా వదులుతున్నారు. ఇక జూన్ 1న ఖాళీ ఉందని ఆ తేదీకి ఫిక్సయిన ‘రాజు గాడు’ చిత్రానికి గట్టి పోటీ వచ్చేసిన నేపథ్యంలో ఆ రోజు ఆ చిత్రం రావడం సందేహంగా మారింది. తర్వాతి వారానికి ‘కాలా’తో పాటు హాలీవుడ్ డబ్బింగ్ సినిమా ‘జురాసిక్ వరల్డ్’ రాబోతున్నాయి. ఆ వారానికి వేరే తెలుగు సినిమాలేవీ రాకపోవచ్చు.

జూన్ 14 విషయంలో గందరగోళం నెలకొని ఉంది. ఆ తేదీకి ‘సాక్ష్యం’.. ‘సమ్మోహనం’ సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. కానీ వీటికి పోటీగా ‘టాక్సీవాలా’ కూడా తయారైన నేపథ్యంలో త్రిముఖ పోటీ కష్టమే. రేసులోంచి ఏవి తప్పుకుంటాయో.. ఏవి పక్కాగా వస్తాయో చెప్పడం కష్టం. మొత్తానికి టాలీవుడ్లో ప్రస్తుతం ఈ రిలీజ్ డేట్ల గందరగోళం కొనసాగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు