బాలయ్య వాళ్లకు మళ్లీ ఛాన్సిచ్చాడా?

బాలయ్య వాళ్లకు మళ్లీ ఛాన్సిచ్చాడా?

నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఆల్ టైం హిట్లుగా నిలిచిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ లాంటి చిత్రాలకు మాటలు రాయడంతో పాటు కథ-స్క్రీన్ ప్లేలోనూ సహకారం అందించారు దిగ్గజ రచయితలు పరుచూరి బ్రదర్స్. బాలయ్య కెరీర్ మరో స్థాయికి చేరడంలో వీళ్లిద్దరిదీ కీలక పాత్ర. అందుకే వాళ్లను బాలయ్య చాలా చాలా నమ్మేవాడు. వాళ్లతో చేసినన్ని సినిమాలు ఇంకెవ్వరితోనూ బాలయ్య చేయలేదు. కానీ ‘నరసింహనాయుడు’ తర్వాత వీళ్ల కాంబినేషన్ బెడిసికొట్టింది.

బాలయ్య కెరీర్లో అత్యంత చెత్త సినిమాగా పేరు తెచ్చుకున్న ‘పలనాటి బ్రహ్మనాయుడు’ విషయంలో పరుచూరి సోదరులు శ్రుతి మించారన్న విమర్శలొచ్చాయి. తొడ గొడితే ట్రైన్ వెనక్కెళ్లిపోవడం.. కుర్చీ ముందుకు రావడం లాంటి సిల్లీ సీన్లు రాసి బాలయ్య ఇమేజ్ ను డ్యామేజ్ చేశారంటూ వాళ్లపై విమర్శలొచ్చాయి. ఆ తర్వాత కూడా పరుచూరి సోదరుల హ్యాండ్ పడ్డ సినిమాలన్నీ తేడా కొట్టేస్తుండటంతో బాలయ్య వాళ్లకు టాటా చెప్పేశాడు.

మధ్యలో ‘హరహర మహాదేవ’ అంటూ వాళ్లు రాసిన ఒక కథతో  సినిమా మొదలుపెట్టి ఆపేశాడు బాలయ్య. మళ్లీ వాళ్ల వైపు చూడలేదు. ఐతే సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పరుచూరి సోదరులు బాలయ్య సినిమాకు రచన చేస్తున్నట్లు సమాచారం. బాలయ్య త్వరలోనే వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రచయితలుగా పలు పేర్లు పరిశీలించి చివరికి పరుచూరి సోదరులకు ఫిక్సయ్యారట. ఒక యువ రచయితతో అందించిన మూల కథ ఆధారంగా వాళ్లే స్క్రిప్టును తీర్చిదిద్దుతున్నారట. బాలయ్య కూడా వాళ్ల పనితీరు పట్ల సంతృప్తిగానే ఉన్నారట. కథ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం.

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత వినాయక్ సినిమా మీదికి రావాలని బాలయ్య అనుకున్నాడు. కానీ అది ఆలస్యం కావడంతో ఈ చిత్రాన్ని త్వరగా మొదలుపెట్టేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే స్క్రిప్టు పనులు త్వరగా పూర్తి చేయడానికి అనుభవజ్ఞులైన పరుచూరి సోదరుల్ని తీసుకొచ్చారు. మరి ఈ సెన్సేషనల్ కాంబినేషన్లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు