‘ఆర్ఆర్ఆర్’ పాట రాజమౌళి తీయలేదు

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ నుంచి దోస్తీ పేరుతో తొలి పాట‌ను ఆదివారం విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. వివిధ భాష‌ల‌కు చెందిన అయిదుగురు మ్యుజీషియ‌న్స్ ఈ పాట‌ను వేర్వేరు భాష‌ల్లో ఆల‌పించారు. ఈ పాట‌కు మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది ప్రేక్ష‌కుల నుంచి.

కీర‌వాణి.. అయిదుగురు మ్యుజీషియ‌న్స్.. అలాగే హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ల‌తో ఈ పాట‌ను చాలా గ్రాండ్‌గా చిత్రీక‌రించిన విధానం మాత్రం అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. ఐతే ఈ పాట‌ను చిత్రీక‌రించ‌డంలో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి పాత్ర ఏమీ లేద‌ట‌.

అస‌లీ మ్యూజిక్ వీడియో ఐడియానే ఆయ‌న‌ది కాద‌ట‌. రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయనే దీనికి క‌ర్త క‌ర్మ క్రియ అట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా రాజ‌మౌళే వెల్ల‌డించ‌డం విశేషం. ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌నీ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు.

తాను ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉండ‌గా.. దోస్తీ పాట‌కు సంబంధించి మ్యూజిక్ వీడియో చేద్దామ‌న్న ఆలోచ‌న చేసింది.. ఈ పాట‌ను గ్రాండ్‌గా చిత్రీక‌రించింది కార్తికేయ అని రాజ‌మౌళి తెలిపాడు. స‌తీష్ కృష్ణ‌న్ అనే డ్యాన్స్ కొరియోగ్రాఫ‌ర్‌తో క‌లిసి కార్తికేయ ఈ పాట‌ను ప్లాన్ చేసి షూట్ చేశాడ‌ని జ‌క్క‌న్న వెల్ల‌డించాడు.

ఈ పాట‌లో భాగ‌మైన మ్యుజీషియ‌న్ల‌కు, లిరిసిస్టుల‌కు రాజ‌మౌళి కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు. బేసిగ్గా దోస్తీ పాట‌ను సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాశార‌ని.. దాన్ని వివిధ భాష‌ల‌కు చెందిన లిరిసిస్టులు అడాప్ట్ చేసుకుని వారి వారి భాష‌ల్లో అద్భుత‌మైన సాహిత్యం స‌మ‌కూర్చార‌ని రాజ‌మౌళి కొనియాడాడు.

ఇంత‌కుముందు రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో విష‌యంలోనూ త‌న క్రెడిట్ ఏమీ లేద‌ని.. రెండు నెల‌ల పాటు క‌ష్ట‌ప‌డి దాన్ని కార్తికేయ‌నే తీర్చిదిద్దాడ‌ని త‌న కొడుక్కి అప్పుడు కూడా రాజ‌మౌళి ఘ‌న‌త క‌ట్ట‌బెట్ట‌డం తెలిసిందే.