వర్మను అతను వదలట్లేదే..

వర్మను అతను వదలట్లేదే..

ఎవరో ఒకరిని టార్గెట్ చేయడం.. విమర్శలు గుప్పించడం.. అదే పనిగా గిచ్చడం రామ్ గోపాల్ వర్మకు అలవాటు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లను ఆయన ఎన్నిసార్లు టార్గెట్ చేసుకున్నారో తెలిసిందే. అవతలి వ్యక్తులు ఎంత ఫ్రస్టేట్ అయినా.. అభిమానులు హెచ్చరికలు జారీ చేసినా వర్మ మాత్రం తగ్గింది లేదు. ఐతే ఇలా వేరే వాళ్లను ఇబ్బంది పెట్టే వర్మనే ఒక వ్యక్తి ఇరుకున పెడుతున్నాడు కొన్ని రోజులుగా.

గత ఏడాది వర్మ తీసిన ‘జీఎస్టీ’ కాన్సెప్ట్ తనదంటూ తాను రెండేళ్ల కిందట రాసిన ఒక పుస్తకాన్ని ఆధారంగా చూపిస్తూ జై కుమార్ అనే కుర్రాడు వర్మకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ వివాదం ఎంతకీ తేలలేదు. అతను మాత్రం వర్మపై పోరాటం ఆపలేదు.

ఇప్పుడు వర్మ నుంచి వస్తున్న కొత్త సినిమా ‘ఆఫీసర్’ కూడా తన కథను కాపీ కొట్టి తీసిందే అంటూ జై కుమార్ ఇటీవలే ఆరోపణలు గుప్పించాడు. అతను వర్మకు ఈ విషయమై లీగల్ నోటీసులు కూడా పంపడం విశేషం. జీఎస్టీ.. ఆఫీసర్ మాత్రమే కాదని.. వర్మ తీసిన చాలా సినిమాలు కాపీనే అని అతనంటున్నాడు. తనతో 7-8 సినిమాలకు వర్మ పని చేయించుకున్నాడని.. కానీ వేటికీ పేమెంట్ ఇవ్వడం కానీ.. క్రెడిట్ ఇవ్వడం కానీ చేయలేదని అతను ఆరోపించాడు.

‘ఆఫీసర్’ విషయంలోనూ తనకు అన్యాయం జరిగిందని.. ఈ విషయమై హీరో అక్కినేని నాగార్జునను కలిసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని.. వర్మ కూడా తనను ఇగ్నోర్ చేశాడని.. అందుకే లీగల్ యాక్షన్‌కు సిద్ధమయ్యానని జై చెప్పాడు. మరోవైపు వర్మను ఈ విషయమై ఓ ఇంగ్లిష్ డైలీ వివరణ కోరితే.. తన స్థాయికి తగని వ్యక్తులు చేసే ఆరోపణలపై తాను స్పందించనని చెప్పడం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు