ఆ సినిమాతో మొత్తం పోయిందన్న శర్వా

ఆ సినిమాతో మొత్తం పోయిందన్న శర్వా

హీరోలు నిర్మాతలుగా మారడం టాలీవుడ్లో కొత్తేమీ కాదు. ఐతే చాలా మంది హీరోలు ఒక స్థాయికి చేరాకే నిర్మాతలుగా మారారు. పెద్ద స్థాయిలో ప్రొడక్షన్ హౌజ్‌లు నడిపించారు. ఐతే యువ కథానాయకుడు శర్వానంద్ మాత్రం కెరీర్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న దశలో నిర్మాతగా మారాడు. అనీష్ కురువిల్లా దర్శకత్వంలో తనే హీరోగా ‘కో అంటే కోటి’ అనే సినిమా తీశాడు. ఆ చిత్రం దారుణమైన ఫలితాన్నందుకుంది. జీవితంలో తాను చేసిన అతి పెద్ద తప్పు ఆ సినిమాను ప్రొడ్యూస్ చేయడమే అంటూ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు శర్వా.

ఆ సినిమా చేయడం పొరబాటు అనడం కంటే పెద్ద పాఠం అనడం కరెక్టని.. తాను ఏమైనా చేసేయగలను అనే మితిమీరిన విశ్వాసానికి ‘కో అంటే కోటి’ చెక్ పెట్టిందని శర్వా తెలిపాడు. అప్పటివరకు తాను సంపాదించిన డబ్బులన్నీ ఈ సినిమా మీదే పెట్టానని.. అదంతా పోయిందని శర్వా తెలిపాడు. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి తనకు మూడేళ్లు పట్టిందని కూడా అతనన్నాడు. ఐతే మళ్లీ సినిమానే తనలో ధైర్యం నింపిందని చెప్పాడు. తన కొత్త సినిమా వస్తోందంటే 15 రోజుల ముందు నుంచి టెన్షన్ పడతానని.. సినిమా పోతే ఓ 15 రోజులు బాధపడతానని.. ఆ తర్వాత వేరే సినిమా పనిలో పడిపోతానని శర్వా తెలిపాడు.

ఇక సినీ పరిశ్రమలో మనం చేసే తప్పుల వల్ల నష్టపోతాం తప్ప మనల్ని ఎవ్వరూ తొక్కేయరని.. అలా అయితే తాను ఇప్పుడున్న స్థితికి చేరేవాడిని కాదని శర్వా చెప్పాడు. తనకు తొమ్మిదేళ్ల పోరాటం తర్వాత కానీ సక్సెస్ రాలేదని.. కానీ అంత కాలం ఎదురు చూసినందుకు మంచి ఫలితమే దక్కిందని.. తర్వాత బాగానే నిలదొక్కుకున్నానని చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు